రఘునాథపాలెం/ కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 18: గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు ఖమ్మంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మెయిన్స్ పరీక్షల్లో ఉన్న లోపాలను సవరించడంతోపాటు మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మూడు రోజులుగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. జీవో నంబర్ 29ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 29ని వెంటనే రద్దు చేయాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు భద్రాద్రి జిల్లా గ్రంథాలయం ఎదుట శుక్రవారం ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేశ్‌నాయక్ మాట్లాడుతూ జీవో నంబర్ 29 అమలు చేయడం వల్ల గ్రూప్-1 రాసే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారానే వారికి న్యాయం జరుగుతుందని, వెంటనే జీవో నంబర్ 29ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనునాయక్, లావుడ్యా వెంకటేశ్‌నాయక్, బానోత్ నాగరాజు, బానోత్ లక్ష్మణ్, వపన్, రమేశ్, దేవేందర్, సురేశ్, బాలు తదితరులు పాల్గొన్నారు.