ఖమ్మం వ్యవసాయం, మార్చి 20 : తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్ర ఖమ్మం జిల్లా రైతాంగానికి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి నేడు యాసంగిలో తిండిమందం ధాన్యం పంట పండించుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం ఆరంభంలో వారం రోజులపాటు కురిసిన వర్షాలు ఆ తరువాత కనుమరుగయ్యాయి.
అయితేనేం సాగర్ కాలువలో నీటి విడుదల అయితే చాలు పుష్కలంగా వరి, మక్క సాగు చేయవచ్చు అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. కనీసం ఆరుతడి పంటలకు సైతం నీరు విడుదల కాకపోతుందా.. అని సాగు చేపట్టిన రైతులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలతో అతలాకుతలమవుతున్నారు. జనవరిలో జిల్లాలో భూగర్భ జలాల సగటు 5.46 మీటర్ల లోతు కాగా.. ఫిబ్రవరి చివరి నాటికి పాతాళగంగ 6.22 మీటర్ల లోతుకు వెళ్లింది. గత ఏడాది ఫిబ్రవరిలో జిల్లా సగటు 4.46 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉంది. ఈ సంవత్సరం భూగర్భ జలశాఖ అధికారుల పరిశీలన తరువాత ఫిబ్రవరి చివరిలో 6.22 మీటర్ల జిల్లా సగటు నమోదైంది.
ఈ నెల చివరి వరకు మరో 2 మీటర్ల లోతుకు పాతాళగంగ కిందికి పోయే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పాలేరు నుంచి మొదలుకొని జిల్లా సరిహద్దు గంగారం వరకు ప్రతి మండలంలో భూగర్భ జలాలు దినదినం పడిపోతుండడంతో రిజర్వాయర్లు, బోరు బావులు, ఓపెన్బావులను నమ్ముకొని సాగు చేపట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వైరా, పాలేరు, లంకాసాగర్ రిజర్వాయర్ల పరిధిలో సైతం గత ఏడాదితో పోల్చితే సగానికి సగం సాగు విస్తీర్ణం తగ్గడం ఆందోళనకు గురిచేస్తున్నది. భూగర్భ జలాలు తగ్గడంతో తద్వార వారం రోజుల నుంచి క్రమంగా బోరుబావులు, ఓపెన్ బావులు సైతం ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో వరుస తడులతో వరి పంటను కాపాడుకునే పనిలో రైతులు ఉన్నారు.
ఖమ్మం జిల్లా భూగర్భ జలశాఖ అధికారుల నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి జిల్లావ్యాప్తంగా సరాసరి 6.22 మీటర్ల లోతుకు నీటి లభ్యత ఉందని అధికారులు నిర్ధారణ చేశారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు నాటికి కేవలం 5.46 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉంది. సత్తుపల్లి మండలంలో రికార్డుస్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మండల పరిధిలో 17.42 మీటర్ల లోతుకు పాతాళగంగ వెళ్లిపోయింది. దీంతో సత్తుపల్లి నియోజకవర్గంలో పలు మండలాల్లో తాగునీటి కొరత సైతం ఏర్పడే అవకాశం ఉంది.
ఏన్కూరు మండలంలో 9.51 మీటర్లు, ఎర్రుపాలెం 9.77 మీటర్లు, మధిర 6.84 మీటర్లు, కామేపల్లి 10.23 మీటర్లు, సింగరేణి 6.81 మీటర్లు, రఘునాథపాలెం 7.44 మీటర్లు, పెనుబల్లి 5.95 మీటర్లు, వేంసూరు 6.87 మీటర్లు, కూసుమంచి 5.36 మీటర్ల దిగువలో సరాసరి సగటును అధికారులు గుర్తించారు. అయితే మార్చి చివరినాటికి జిల్లాలో సగానికి సగం బోరు బావులు పూర్తిగా ఎండిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. జిల్లావ్యాప్తంగా భూగర్భ జలశాఖ ఏర్పాటు చేసిన 66 పాయింట్ల వద్ద ఫిబ్రవరి నెలకు సంబంధించిన శాంపిల్స్ సేకరిస్తున్నారు. సాగర్ కాలువ పరీవాహక ప్రాంతంలో బోరుబావుల కింద సాగు చేసిన వరి పొలాల సాగు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.