ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆది నుంచీ అభాసుపాలవుతున్నది. ఎంతోకాలంగా ఊరిచ్చి ఊరిచ్చి సిద్ధం చేసిన అర్హుల జాబితాలో కాంగ్రెస్ స్వార్థం బయటపడింది. హస్తం పార్టీ వాళ్లకే ఇళ్లు మంజూరు చేసి తమకు మొండి‘చేయి’ చూపారంటూ నిరుపేదలు మండిపడ్డారు. స్థానిక నాయకులు, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన వారినే అందలమెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ అర్హుల జాబితాను పరిశీలించడానికి వచ్చిన అధికారులను పేదలు నిలదీశారు. ప్రభుత్వాన్ని నమ్మి ఉన్న గుడిసెలను సైతం కూల్చుకున్న వారికి ఇళ్లు ఇవ్వకుండా డబ్బున్నోళ్లకు ఎలా మంజూరు చేస్తారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దత్తత గ్రామం చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్‌లో అధికార పార్టీ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంతో మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ముదిగొండ మండలం వనంవారికిష్టాపురంలో పంచాయతీ కార్యదర్శి, గుమస్తాను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. మరోమారు సర్వే చేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, అప్పటివరకు ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో తనిఖీ అధికారులు చేసేదేమీలేక తెల్లముఖం వేసుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు. ఖమ్మంరూరల్ మండల పరిషత్ కార్యాలయానికి ఆరెకోడుతండాకు చెందిన గిరిజన మహిళలు వెళ్లి నిరుపేదలమైన తమకు ఇళ్లు మంజూరు చేసి.. న్యాయం చేయాలని అధికారులకు విన్నవించారు.
అశ్వారావుపేట, ఏప్రిల్ 29 : నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేసేందుకు ప్రత్యేకాధికారైన మండల వ్యవసాయాధికారి శివరాం ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. జాబితాను పరిశీలిస్తుండగా పంచాయతీ పరిధిలోని నారాయణపురం, పెంచికలపాడు, నెమలిపేట, సూర్యంపేట, జగన్నాథపురం గ్రామాల నిరుపేదలు అక్కడకు చేరుకున్నారు. నిరుపేదలమైన తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా ఆస్తులు ఉన్న పెద్దలకు కేటాయించారని మడకం లక్షుడు, ముద్దల నారాయణ, పవన్‌కుమార్, కుమారస్వామి, లక్ష్మణ్, బోయినపల్లి మధు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని, వలస రాజకీయ నేతల సూచన మేరకు లబ్ధిదారులను ఎంపిక చేశారని, మహిళా కమిటీ సభ్యుల భర్తల పెత్తనం ఏమిటని నిలదీశారు. పేదలు అధికంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేసి అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారంటూ అధికారులు, ఇందిరమ్మ కమిటీ బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రభుత్వం నిరుపేదలకు మొదటి ప్రాధాన్యతనిస్తామని ప్రకటిస్తున్నా స్థానిక రాజకీయ నాయకులు తన అనుచరులకే ప్రాధాన్యతనిచ్చారని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు మంజూరు చేసేవరకు సర్వే చేయొద్దని తేల్చిచెప్పారు. దీంతో సర్వే అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
చండ్రుగొండ, ఏప్రిల్ 29 : అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దత్తత తీసుకున్న మహ్మద్‌నగర్ గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని మంగళవారం తనిఖీకి వచ్చిన అధికారులపై మహిళలు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. ఇండ్లు లేని, గుడిసెలు ఉన్నవారికి, పేదలు, వితంతువులు, దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు రాలేదో అధికారులు జవాబు చెప్పాలన్నారు. కేవలం భూములు ఉన్నవారికి, ఇందిరమ్మ కమిటీ చెప్పిన వారికే ఇండ్లు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి వినయ్, పంచాయతీ కార్యదర్శి శివపై గ్రామస్తులు, మహిళలు మండిపడ్డారు. దీంతో తూతూమంత్రంగా సర్వే చేసి, అక్కడ నుంచి అధికారులు వెళ్లిపోయారు.
ముదిగొండ, ఏప్రిల్ 29 : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని మండల పరిధిలోని వనంవారి కిష్టాపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయానికి నిరుపేదలు తాళం వేశారు. ఇళ్లు మంజూరైన 26 మందిలో కనీసం దరఖాస్తు కూడా చేసుకోని వారి పేర్లు కూడా ఎందుకున్నాయని పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌ను నిలదీశారు. తమకు ఉండటానికి ఇళ్లు లేకపోయినా తమ పేరు ఎందుకు రాలేదని, పక్కా ఇళ్లు, పొలాలు, కార్లు ఉన్న వారిని లబ్ధిదారులుగా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహించి పంచాయతీ కార్యదర్శి, గుమస్తాను పంచాయతీ కార్యాలయం లోపల ఉంచి బయట తాళం వేసి తమ నిరసన తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని బయటకు తీసుకురాగా.. ఇది ఫైనల్ లిస్టు కాదనీ, ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిగణనలోకి తీసుకుని అనర్హులు ఉంటే తొలగిస్తామని చెప్పడంతో శాంతించారు. మండల పరిధిలోని పండ్రేగుపల్లి గ్రామస్తులు సైతం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 29 : ‘కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితేనే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో కమిటీ బాధ్యులు పేర్లు ఉంచుతున్నారు.. వారికి గిట్టని వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇక అధికారులే మాకు న్యాయం చేయాలి’ అని కోరుతూ ఖమ్మంరూరల్ మండల పరిషత్ కార్యాలయానికి బాధితులు క్యూ కడుతున్నారు. మూడురోజులుగా కార్యాలయానికి వస్తూ అధికారుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మంగళవారం ఆరెకోడుతండాకు చెందిన గిరిజన మహిళలు ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తంచేశారు. పైరవీ ఉంటే తప్ప న్యాయం జరగడం లేదని, తండాకు వచ్చి మా పరిస్థితిని చూడాలని అధికారులను వేడుకున్నారు.
– ఆరెకోడుతండా గిరిజన మహిళల వినతి
నేను, నా భర్త, నా కొడుకు ముగ్గురం రేకులషెడ్డులోనే ఉంటున్నాం. గాలిదుమారానికి రేకులు కొట్టుకుపోతున్నాయి. కొత్త ఇల్లు కట్టుకుందామంటే సరిపోయే అన్ని డబ్బులు లేవు. మాకు గుంట భూమి కూడా లేదు. కూలికిపోయి బతుకుతున్నాం. ఇల్లు మంజూరైందని అప్పట్లో చెప్పారు. దీంతో చాలా సంతోషపడ్డాం. అధికారులను ఇప్పుడు అడిగితే మీకు ఇప్పట్లో రాదు తర్వాత చూద్దాం అంటున్నారు. మా రేకుల షెడ్డును చూసి నాకు న్యాయం చేయాలి.
– బానోతు బద్రి, ఆరెకోడుతండా, ఖమ్మంరూరల్ మండలం
తండాలో మాది చాలా బీద కుటుంబం. ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ వాళ్లమే అయినా మా తండా నాయకుడు ఇళ్ల జాబితాలో నా పేరు లేకుండా చేశారు. ఇది చాలా అన్యాయం. దీని గురించి ఎంపీడీవో సారుకు చెప్పి.. న్యాయం అడుగుదామని వచ్చాను. కమిటీ వాళ్లకు నచ్చితే పేరు ఉంటదట.. లేకుంటే పేరు తీసేస్తరంట. ఇదెక్కడి న్యాయం. కలెక్టర్ సారు మా తండాకు వచ్చిన మా ఇళ్ల పరిస్థితిని చూసి న్యాయం చేయాలి.
– భూక్యా లక్ష్మి, ఆరెకోడుతండా, ఖమ్మంరూరల్ మండలం