భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం పర్యటించిన ఆయన.. ఆయా అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. తొలుత భద్రాద్రి ఐడీవోసీలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్‌కు ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్‌లు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రాముఖ్యత, సంస్కృతీ సంప్రదాయాలు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగున్నదని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73గా ఉన్న రక్తహీనత శాతాన్ని 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం ఐడీవోసీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జిల్లా యంత్రాంగం తరఫున గవర్నర్‌ను కవులు, రచయితలు శాలువా కప్పి జ్ఞాపికలతో సన్మానించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీఎఫ్‌వో కిష్టాగౌడ్, ఆర్డీవోలు మధు, దామోదర్ పాల్గొన్నారు.
రామయ్య సేవలో రాష్ట్ర గవర్నర్
భద్రాచలం, అక్టోబర్ 25: భద్రాచలం సీతారామచంద్రస్వామిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం దర్శించుకున్నారు. గవర్నర్‌కు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలోని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ధ్వజస్తంభం వద్ద పూజలు చేసిన తర్వాత గవర్నర్‌కు అర్చకులు పట్టువస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉప ఆలయాల్లోనూ పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
దుకాణాల మూసివేత.. మీడియాకు నో ఎంట్రీ..
కాగా, గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఉదయం రామాలయ మాడవీధులు, ఆలయ పరిసరాల్లోని దుకాణాలను ముందస్తుగా మూసివేయించారు. దీంతో వ్యాపారులతోపాటు పూజ సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు ఇబ్బందిపడ్డారు. ఆలయంలోని భక్తులు కూడా సుమారు రెండు గంటలపాటు నీరీక్షించారు. అయితే, గవర్నర్ పర్యటనకు మీడియాను అనుమతించని పోలీసులు.. కాంగ్రెస్, బీజేపీ నేతలను మాత్రం అనుమతించారు.