భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో ఉద్యోగాలు చేసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ససేమిరా అంటున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 232 మంది టీచర్లను వివిధ స్కూళ్లకు వర్క్ అడ్జెస్ట్మెంట్లో భాగంగా సర్దుబాటు చేశారు. అయితే వీరిలో 82 మంది ఇప్పటివరకు ఆయా పాఠశాలల్లో జాయిన్ కాలేదు. కొందరు అనారోగ్య సమస్యలు చూపితే.. మరికొందరు బస్సు సౌకర్యం లేదని, అక్కడ నీళ్లు పడవని.. కుటుంబ సభ్యులకు బాగోలేదని.. ఇలా పలురకాల సాకులు చెప్పి పాతస్థానం నుంచి కదలడం లేదు. పల్లె, దూరప్రాంతాలకు వెళ్లడం ఇష్టంలేక కొందరు ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,070 ప్రభుత్వ పాఠశాలల్లో 600పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 232 పాఠశాలల్లో టీచర్లు అత్యవసరం ఉండటంతో సర్దుబాటు బదిలీలు చేసినప్పటికీ జాయిన్ కానీ ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు నేటికీ చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లు దగ్గరపడుతున్నా నేటికీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేకపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,070 పాఠశాలలకు గాను ఇప్పటివరకు 3,757 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. తాజాగా ఉద్యోగోన్నతుల్లో భాగంగా కొందరు టీచర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. రెగ్యులర్ ఎంఈవోలు కూడా లేకపోవడంతో టీచర్లే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఏటా వర్క్ అడ్జెస్ట్మెంట్ ద్వారా స్కూల్స్లో పిల్లల సంఖ్యను బట్టి టీచర్లను సర్దుబాటు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అదే సర్దుబాటు చేయగా.. పల్లె, మారుమూల ప్రాంతాలకు వెళ్లడానికి టీచర్లు ససేమిరా అంటున్నారు. పైరవీలు చేసుకొని పాత స్కూళ్లకే పరిమితమయ్యారు. ఇదే అదునుగా సర్దుబాటు చేసే అధికారులు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
టేకులపల్లి మండలంలో 18 మందిని సర్దుబాటు చేస్తే ఒక్కరు కూడా నేటికీ జాయిన్ కాకపోవడం విశేషం. కాగా, అక్కడ వారు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి పైరవీలు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఇలాంటి సర్దుబాటు ప్రక్రియకు స్థానిక ప్రజాప్రతినిధులు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పాల్వంచ మండలం కోయగట్టు, గంగిదేవిగుప్ప, టేకులపల్లి మండలం చింతోనిచెలక, కొప్పురాయి, ఇల్లెందు, అశ్వారావుపేట మండలాల్లో సింగిల్ టీచర్లు ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అక్కడ టీచర్ సెలవు పెడితే బడికి తాళం పడినట్లేనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో నివసించడం మేము చేసినా తప్పా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది 232 మంది టీచర్లను సర్దుబాటు చేశాం. కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నాయని లెటర్ పెట్టుకున్నారు. దీంతో వారిని పరిశీలించి వేరే జాబితాను తయారు చేయమని ఎంఈవోలను ఆదేశించాం. ఆ ప్రకారమే కొత్త ఫైల్ కూడా పెట్టాం. కలెక్టర్ సారు పరిశీలన చేస్తున్నారు. సాకులతో జాయిన్ కాని టీచర్ల వివరాలను పరిశీలిస్తున్నాం. తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల్లో అన్ని స్కూల్స్లో సర్దుబాటు టీచర్లు జాయిన్ అవుతారు.
-నాగలక్ష్మి, డీఈవో, భద్రాద్రి కొత్తగూడెం