ఖమ్మం అర్బన్, నవంబర్ 20 : విద్యా బోధనలో కృత్యాధార బోధన, ప్రయోగాత్మక బోధన అనే రెండు పద్ధతులు చాలా కీలకం. అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్యాధార బోధన మాత్రమే జరుగుతోంది. ప్రయోగాత్మక బోధన జరగడం లేదు. అయితే, ప్రయోగాత్మక బోధన ద్వారా.. వంద చిత్రాల్లోని సారాన్ని ఒక ప్రయోగంతో వివరించవచ్చు. ఇంతటి ముఖ్యమైన ప్రయోగాత్మక బోధన అందించేందుకు ఖమ్మం జిల్లాలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ‘సైన్స్ మ్యూజియం’ మూలనపడింది. దీంతో ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది జిల్లాలో విద్యాశాఖ పరిస్థితి. సైన్స్ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత ప్రభుత్వమే అన్ని చర్యలూ తీసుకుంది. ముస్తాబు కూడా చేసింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం; రెగ్యులర్ డీఈవోలు, డీఎస్వోలు లేకపోవడం వంటి కారణాలతో ఇప్పటి వరకు అది అందుబాటులోకి రాలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రయోగాలతో కూడిన బోధనను అందించేందుకు గత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ప్రయోగాత్మక బోధనకు అవసరమైన సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు 2023 జనవరిలో అప్పటి కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మంలోని పాత డీఈవో కార్యాలయాన్ని కేటాయించారు. ఇందుకోసం రూ.50 లక్షల నిధులను కూడా వెచ్చించగా.. 2023 ఆగస్టులోనే పాత డీఈవో కార్యాలయాన్ని సైన్స్ మ్యూజియానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అది ముస్తాబై రెండేళ్లు దాటినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో కొనుగోలు చేసిన ప్రయోగ పరికరాలను వినియోగించకపోవడంతో అవి వృథా అవుతున్నాయి. మరికొన్ని తుప్పుపట్టి పనికిరాకుండా పోతున్నాయి. అయితే, ఈ సైన్స్ మ్యూజియం ప్రాంగణంలో గ్రౌండ్ ఫ్లోర్‌ను సెమినార్లు, కళా ఉత్సవాలు వంటి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
‘సైన్స్ అంటే మక్కువ పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ అంటే భయం పోవాలి. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి’ అంటూ పదేపదే మాటలు వల్లె వేస్తున్న విద్యాశాఖ అధికారులు.. వాటి అమలును కార్యరూపంలోకి తేవడం లేదు. మ్యూజియాన్ని ముస్తాబు చేసి ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు వాటి ఫలాలు అందించకపోవడమే ఇందుకు ఉదాహరణగా ఉంది. ఆశయాలు, ఆచరణ గొప్పగా ఉండాలని చెప్పే విద్యాశాఖ అధికారులు.. సైన్స్ మ్యూజియాన్ని వినియోగంలోకి తెచ్చే విషయంలో మాత్రం ఆమడదూరంలో ఆగిపోయారు. సైన్స్ మ్యూజియం నిర్వహణకు నిధుల కొరత లేకున్నా విద్యార్థుల ప్రయోగాలకు అవకాశం లభించడం లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) ఫండ్స్ కింద నివోసాల్ అనే సంస్థ కూడా రూ.20 లక్షలు అందించింది. ఎక్కడ అవాంతరాలు లేకపోయినా.. సైన్స్ మ్యూజియం మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫలితంగా లక్ష్యం కుంటుపడుతోంది. విద్యార్థులకూ ఉపయోగం లేకుండా పోతోంది.
ఖమ్మం జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు దిశగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేసింది. దీంతో 2023 ఆగస్టులోనే అప్పటి అధికారులు సైన్స్ మ్యూజియం పరికరాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా పాత డీఈవో కార్యాలయంలో మార్పులు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లను తీర్చిదిద్దారు. భవనం చుట్టూ జాలీని ఏర్పాటు చేశారు. విద్యాశాఖ ఆదేశాలతో ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సుమారు రూ.19 లక్షలతో పనులు పూర్తిచేశారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, వినూత్న ఆలోచనా విధానం వంటివి పెంపొందించేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు పర్చారు. వాటికి సంబంధించిన నిధులను కూడా జిల్లా సైన్స్ ఆఫీసర్(డీఎస్వో), డీఆర్వోల జాయింట్ అకౌంట్లో అందుబాటులో ఉంచారు. వీటిల్లో నుంచే మరమ్మతులకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేశారు.
6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథ్స్లలోని ముఖ్యమైన పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా వివరించేందుకు నిపుణుల ఆధ్వర్యంలో 27 అంశాలను ఎంపిక చేశారు. రూ.40 లక్షలతో ప్రయోగ పరికరాలను కొనుగోలు చేసి సైన్స్ మ్యూజియంలో బిగించారు. బిర్లా సంస్థ కూడా మరికొన్ని పరికరాలను అందజేసింది. ఇంతలో.. గతంలో ఖమ్మంలో పనిచేసిన డీఎస్వో సైదులు.. హెచ్ఎం ప్రమోషన్‌పై మరో జిల్లాకు వెళ్లారు. ఆ తరువాత వచ్చిన డీఎస్వో జగదీశ్ కూడా అనారోగ్య సమస్యలతో సెలవుపై వెళ్లారు. దీంతో ఇటీవల సత్తుపల్లి ప్రాంతానికి చెందిన రాందాస్ డీఎస్వోగా నియమితులయ్యారు. అదీగాక, రెగ్యులర్ డీఈవోలు కూడా లేకపోవడంతో సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవంపై ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కలెక్టర్ అనుదీప్, డీఈవో చైతన్య జైనీ ప్రత్యేక దృష్టి సారిస్తే సైన్స్ మ్యూజియం ప్రారంభానికి నోచుకునే అవకాశం ఉంటుంది. అది ప్రారంభమైతే విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనలకూ వీలుంటుంది. సైన్స్ మ్యూజియం లక్ష్యమూ నెరవేరుతుంది.