కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అభాసుపాలవుతున్నది. ఈ పథకంలో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులను మొదటినుంచీ తెగ ఏడిపిస్తోంది. సమయానికి బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.
పైగా బిల్లుల చెల్లింపులో ఆ సమస్య ఉంది.. ఈ సమస్య ఉంది అంటూ అధికారులు పేదలను వేధిస్తున్నారు. దీంతో బిల్లులు రావేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. మొదటి బిల్లు ఇస్తే.. రెండోది ఇవ్వడం లేదు.. రెండోది వస్తే మూడోది ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో ఇంటి నిర్మాణ పనులు ఆదిలోనే నిలిచిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులెవ్వరూ దృష్టి పెట్టకపోవడంతో ‘బిల్లులు చెల్లించండి మహాప్రభో’.. అంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. – ఇల్లెందు, ఆగస్టు 1
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామంటూ గొప్పలు చెప్పారు.. తీరా ఇందిరమ్మ ఇళ్ల పథకం చూస్తే ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నది. ఉన్న పాత ఇళ్లను తొలగించి కొత్తగా ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తున్నది. గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నారు. ‘మీ పేరు మీద గతంలో ఇందిరమ్మ బిల్లు వచ్చింది’, ‘మీ ఫొటో అప్లోడ్ కావట్లేదు’, ‘మీ వివరాలు డేటా ఎంట్రీలో తప్పుగా ఎంటర్ చేశారు..
స్పెల్లింగ్ తప్పు ఉంది’ అంటూ పలురకాల కారణాలతో చుక్కలు చూపిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇక రెండో బిల్లుకొస్తే లొకేషన్ ఇక్కడ చూపించట్లేదు.. నియర్లీ అని చూపిస్తున్నది, ఫొటో అప్లోడ్ కావడం లేదని ఇబ్బంది పెడుతున్నారు. పలురకాల సమస్యలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 58 ఇంటి నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని సంతోషంతో నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చుక్కలు చూపిస్తున్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గృహ ప్రవేశాలు చేసింది. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం కొందరు, బిల్లుల కోసం ఇంకొందరు నిరుపేదలు వేయికండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇళ్ల మంజూరు కోసం కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగిన పేదలు ప్రస్తుతం బిల్లుల కోసం తిరుగుతున్నారు. నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులను ఇందిరమ్మ ఇండ్ల యాప్లో ఫొటో అప్లోడ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా బెనిఫిషరీ నేమ్ డజ్నాట్ మ్యాచ్ విత్ ఆధార్ అని వస్తున్నది. దీంతో ఆధార్ అప్డేట్ చేయాలని అధికారులు చూపిస్తున్నారు. ఆధార్ అప్డేట్ చేసి రెండో బిల్లు కోసం వచ్చిన వారికి ఫొటో అప్డేట్ చేస్తుండగా నియర్లీ లొకేషన్ అని చూపిస్తున్నది. ఇలా రకరకాల సాంకేతిక సమస్యల కారణంగా బిల్లులు ఆలస్యమవుతుండడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
నా పేరు ముత్యాల ఉమ. మాది టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామం. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకావడంతో నిర్మాణ పనులు ప్రారంభించాం. ఫస్ట్ బిల్లు వచ్చింది. రెండో బిల్లు కోసం ఫొటో అప్లోడ్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. బిల్లు రాకపోవడంతో ఇంటి పని ఆగిపోయింది. ఇంటి పనులు, వ్యవసాయ పనులు ఒకేసారి ప్రారంభంకావడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. దయచేసి బిల్లులు త్వరగా చెల్లించాలి.
నా పేరు సంగెం వేణుగోపాల్. నాది ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 2వ నెంబర్ బస్తీ. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అధికారులు వచ్చి చెబితే ఉన్న ఇల్లు కూల్చివేశాను. అధికారులు వచ్చి ఫొటో తీసి ఫొటో అప్లోడ్ అయ్యింది.. ఇల్లు నిర్మించుకోవచ్చని చెప్పారు. బేస్మెంట్ పూర్తయిందని చెప్పడంతో వచ్చి ఫొటో తీసిన అధికారులు ఫొటో అప్లోడ్ కాలేదని చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే.. ఇంటి పేరు తప్పుపడిందని చెప్పడంతో కమిషనర్ వద్దకు వెళ్లి సరి చేయించాను. మళ్లీ 20 రోజుల తర్వాత అధికారులు వచ్చి నీ పేరులో గ్యాప్(వేణుగోపాల్ కాకుండా వేణు గోపాల్)అని వచ్చిందని, అందుకే ఆన్లైన్లో రావడం లేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
నా పేరు కల్తీ అనంతరావు. నాది ఇల్లెందు మండలం పూబెల్లి గ్రామం. నాకు తొలి విడతలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నాలుగు నెలల క్రితం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాను. బేస్మెంట్ బిల్లు వచ్చింది. వ్యవసాయానికి, ఇంటి నిర్మాణానికి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాను. బిల్లులు వస్తే ఇంటికి తెచ్చిన అప్పులు తీర్చాలి. ప్రస్తుతానికి స్లాబ్ వేశాను. ఇంకా రెండు బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే బిల్లులు వచ్చేలా చూడాలి. లేకపోతే ఇంటి నిర్మాణానికి, వ్యవసాయానికి తెచ్చిన అప్పులు పెరిగిపోతాయి. అధికారులు ఇంటి బిల్లులు వచ్చేలా చూడాలి.