కొత్తగూడెం గణేష్టెంపుల్, జూన్ 8 : అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి నిరుద్యోగ యువత కోసం రూపొందించిన ‘రాకేశ్రెడ్డి ఈ క్లాస్ యాప్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ఇతర ఉద్యోగాల కోసం వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అమలుకు నోచుకోని హామీలిచ్చి నిరుద్యోగ యువతతోపాటు అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఒక్కసారి కూడా అభివృద్ధి, ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి నోరెత్తని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టానికి మొదటి శత్రువు రేవంత్రెడ్డి అని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంతిగా ఉన్న సమయంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుందని, ఎన్నో నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు కావొస్తున్నప్పటికీ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన రాకేశ్రెడ్డి నిరుద్యోగుల కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్లు విడుదలవుతాయని తెలిపారు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువత ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మానె రామకృష్ణ, కిలారు నాగేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు, వేల్పుల దామోదర్, అనుదీప్, కార్పొరేటర్లు సింధుతపస్వి, మల్లెల స్వప్నకుమారి, బత్తుల మధుచందు, గుణచరిత్ పాల్గొన్నారు.