ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 9 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్‌కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆదివారం బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నది ఒడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు.
అయితే ఇంతలోనే ఓ అనుకోని అతిథిలా.. ఓ మొసలి నదిలో నుంచి పుష్కర్ ఘాట్‌కు వచ్చింది. అది చూసిన కొంతమంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్‌శర్మ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం చేశాడు. మొసలి వరుణ దేవుడి వాహనమని అనిల్‌శర్మ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాల ని కోరుకుంటూ పూ జలు చేసినట్లు ఆయ న తెలిపారు. అనం తరం మొసలిని ఫారె స్టు అధికారులకు అప్పగించారు.