భార్య భర్తల సంబంధం అంటే కలిసి జీవించడం మాత్రమే కాదు. ఒకరికొకరు అండగా నిలబడే, ఒకరినొకరు మెరుగుపరుచుకునే పవిత్రమైన బంధం. ఈ సంబంధంలో ధర్మం, నమ్మకం, గౌరవం, త్యాగం ఉంటేనే అది నిజమైన ప్రేమగా పరిఢవిల్లుతుంది. ఆలుమగలను ఒక రథానికి ఉన్న రెండు చక్రాలతో పోలుస్తారు. ఏ ఒక్క చక్రం పనిచేయకపోయినా ఆ రథం ముందుకు వెళ్లదు. అదే విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడిస్తేనే కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఈ బంధంలో ఒకరు మరొకరికి పోటీగా కాకుండా, పరస్పరం సహకరించే భాగస్వాములుగా ఉండాలి. బాధ్యతలు పంచుకుంటేనే కుటుంబం బలంగా నిలుస్తుంది. ఈ బంధం బలపడేందుకు మన పురాణాలు ఏం చేబుతున్నాయో పరిశీలిద్దాం..
చాలామంది ప్రేమంటే.. భావోద్వేగం లేదా ఆకర్షణ అని భావిస్తారు. కానీ నిజమైన ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎలాంటి షరతులు లేకుండా ఒకరినొకరు అంగీకరించడం, కష్ట సమయంలో అండగా నిలబడటం, అహంకారాన్ని పకనపెట్టి బంధాన్ని ముందుకు పెట్టడం, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తల మధ్య ప్రేమ బలంగా ఉంటుంది. భార్యాభర్తల బంధం గురించి మన వేదాల్లో సైతం గొప్పగా వర్ణించారు. ‘తల్లి తన పిల్లను ఎలా ప్రేమిస్తుందో, అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
భూమిలా స్థిరంగా ఉండాలి. కష్టాల్లో కూడా ధర్మం వదలకుండా నిలబడాలి’ అనే భావాన్ని వివరించారు. హిందూ సంప్రదాయంలో వివాహాన్ని కేవలం ఒక సామాజిక ఒప్పందంగా చూడరు. దాన్ని గృహస్థాశ్రమం అని పిలుస్తారు. ఈ దశలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జీవితం నిర్మించాలి. ఒకరి విజయానికి మరొకరు తోడుగా ఉండాలి. భగవాన్ శివుడు, పార్వతి దేవి దాంపత్యం దీనికి మంచి ఉదాహరణగా చెప్తారు. వారు ఒకరికి ఒకరు బలంగా నిలబడి కుటుంబ జీవనానికి ఆదర్శంగా నిలిచారు.
ధార్మిక గ్రంథాల ప్రకారం ప్రేమ నిలవాలంటే గౌరవం, నమ్మకం చాలా అవసరం. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేకపోతే బంధం బలహీనమవుతుంది. రాముడు, సీతాదేవి దాంపత్య జీవితం ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. వారి బంధంలో గౌరవం, నమ్మకం, ధర్మం ప్రధానంగా ఉన్నాయి. అందుకే భార్యాభర్తలు ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి. పరస్పరం గౌరవించాలి. అదే నిజమైన ప్రేమకు పునాది.