హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారుగా నమోదైనంత మాత్రాన భూమిపై యాజమాన్య హకులు లభించవని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారిక నివేదికలు, అఫిడవిట్ల ఆధారంగా యాజమాన్య హకులను నిర్ధారించలేమని, యాజమాన్య హకులను తేల్చాల్సింది సివిల్ కోర్టు మాత్రమేనని పేరొన్నది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం చినరావల్పల్లిలోని వివిధ సర్వే నంబర్లలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాల భూములపై దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హరికీర్తి ఆంజనేయులు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జీఎం మొహియుద్దీన్ విచారణ జరిపారు.
ఆ భూములు తమ తాతల నుంచి సంక్రమించాయని, 1955-56, 1957-58 పహాణీల్లో పట్టాదారుగా తమ తాత పేరు ఉన్నదని పిటిషనర్లు వాదించగా.. 1958-59 నుంచి పహాణీలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పట్టాదారుగా, పిటిషనర్లు అనుభవదారులుగా ఉన్నట్టు దేవాదాయశాఖ తెలిపింది. ఆలయ నిర్వహణ కోసం సేవా ఇనాంగా దాతలు ఆ భూములను ఇచ్చారని పేర్కొన్నది. దీంతో రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. పట్టాదారుకు, అనుభవదారుకు తేడా ఉన్నదని, భూమిని అనుభవిస్తున్నట్టు ఉన్న రెవెన్యూ రికార్డులు యాజమాన్య హకులను నిర్ధారించలేవని స్పష్టం చేసింది. హకులను సివిల్ కోర్టులో తేల్చుకోవాలంటూ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా లేవని పేరొంటూ పిటిషనర్ల వ్యాజ్యాన్ని కొట్టివేసింది.