తెలుగుభాషకు ప్రాచీనతా భాషా హోదా ఇవ్వడానికి అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు చేయగా ఈర్శ్యాళువైన ఒక తమిళుడు మద్రాస్ హైకోర్టులో అభ్యంతరాన్ని తెలుపుతూ ఒక రిట్ వేశాడు. నన్నయ నుంచి సాహిత్యం ప్రారంభం అయిందని నన్నయ 11వ శతాబ్దివాడని, తెలుగువారి సాహిత్య చరిత్ర తొమ్మిది శతాబ్దులేనని అభ్యంతరం పెట్టాడు. దానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కురిక్యాల శాసనంలో తెలుగు పద్యాలున్నాయని, ఆ శాసనం క్రీస్తుశకం 10వ శతాబ్దానికి చెందినదని, ఆ సాహిత్యానికి వెయ్యేండ్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం వాదించగా, న్యాయాధిపతులు అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వానికి వారి అంగీకారం తెలుపగా, కేంద్రం ప్రాచీనతా హోదానిచ్చింది. ఈ ప్రభుత్వపు అలసత్వంతో కార్యాలయం కాస్తా నెల్లూరులో అక్కడి రాజకీయుల శ్రద్ధతో ప్రారంభమైంది.
నన్నయకు వందేండ్ల ముందువాడైన కన్నడాద్యకవి, తెలుగువాడు, కరీంనగర్ జిల్లా వాడైన పంప మహాకవి. తన విక్రమార్జున విజయకావ్యం వేములవాడ రాజధానిగా ఏలిన పశ్చిమ చాళుక్య ప్రభువు ఇమ్మడి అరికేసరి కొలువులో ఉండి రాసి, ప్రభువుకు అంకితమిచ్చాడు. అరికేసరి తన తండ్రి హయాంలో బోధన్ రాజధానిగా గల రాజ్యా న్ని వేములవాడకు మార్చాడు. పంపడు ప్రభువుతో పాటే వేములవాడ చేరాడు. అతనికి దానంగా ధర్మపురి అగ్రహారం ఇచ్చారు. ఈ విషయాలు వివరిస్తూ అతని తమ్ముడు జినవల్లభుడు కుర్క్యాల శాసనం వేయించాడు. ఈ శాసనం కరీంనగర్-జగిత్యాల రహదారిలో కుర్క్యాల గ్రామ సమీపాన కొండకు చెక్కి ఉన్నది. శాసనకర్త జినవల్లభుడు తాను ‘పంపానుజ’ అనగా పంపని తమ్ముడిగా శాసనంలో పేర్కొన్నాడు.
తొలుత ఈ శాసనం ఎపిగ్రాఫికా ఆంధ్రికా వాల్యూం-1లో, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా శాసనాల సంపుటి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శా ఖ ప్రచురణలో అచ్చయింది. ఈ శాసనకాలం శాసనంలో లేకున్నా, ఇది క్రీస్తుశకం 946 సమీపమైందని విక్రమార్క విజయ రచనానంతరంగా నిర్ధారించారు. దానికి కారణం పం పడు తన ‘ఆదిపురాణం’ దుందుభి నామ సం వత్సరంలో ముగించాడు. అంతేకాదు, పంప డు దుందుభిలో పుట్టాడు. దుందుభి గంభీర నినదం, దుందుభి సంవత్సరోద్భవం అని తను దుందుభిలో పుట్టినట్టు రాసుకున్నాడు. ఆదిపురాణం క్రీస్తుశకం 941లో తన 39వ ఏట పూర్తి చేశాడు. ఇది 16 అశ్వాసాల సుదీర్ఘకావ్యం. పంపడు దానం పొందింది ధర్మపురి గ్రామం. వేములవాడకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణాగ్రహారం. జినవల్లభుడు శాసనంలో ‘ద్విజావసద గ్రామం’ అన్నాడు. ఈ గ్రామంలో కన్నడ బ్రాహ్మణులు ఉండేవారు.
పంపనికి 100 ఏండ్ల ముందు క్రీస్తుశకం 850 ప్రాంతంలో ఈ ఊరులో కొంతభాగం ‘రేవణయ్య’ అనే బ్రాహ్మణునికి హైహయ వంశీకుడైన ఆయతవర్మ దానం చేశాడనే శాసనం ఉన్నది. ఈ ధర్మపురి కరీంనగర్ జిల్లాలోని గోదావరి తీరంగా టీవీ వేంకటాచలం పేర్కొన్న ఊహాత్మక గ్రామం శాసనంలో ఉన్నది కురిక్యాల పక్కనే ఉన్నదన్నది సరికాదు.
1. ‘వినుత చాళుక్య వంశపతి మిక్కరికేసరి నన్ద విక్రమార్జున విజయక్కె ధర్మపురం మెన్దు మదేయం’
2. ‘బరదుదె తాంబ్ర శాసన మదేయమే ధర్మపురం నెగర్తవెత్తరగిన కొట్టుదె నెగఱ్ది పంపన…’
3. ‘సబ్బినాడ నట్టనడువణ ధర్మపుర దుత్తర దిగ్భాగ వృషభగిరి యెంబనాది సంసిద్ధ తీర్థ ద’ అని శాసనం మూడుసార్లు ధర్మపురి పేర్కొని ఉన్నది.
ధర్మపురి ఉత్తర దిక్కున జైన అనే గ్రామం ఉన్నది. ఇతి మత సంబంధి నామమే. పెద్ద పొలం నట్ట నడుమ ఒక చిన్న గుట్ట ఉన్నది. ఆ గుట్ట, పొలం మధ్యలో ఉన్నది. అది నిలబడ్డ ఎద్దులా ఉన్నది. అందుకే దీనిని వృషభాద్రి అని స్థానికులు అంటారు. ఇది ఈ శాసనంలో పేర్కొని ఉన్నది. శాసనంలో పంపని వంశవృక్షం ఉన్నది. విక్రమార్జున విజయంలో వర్ణితమైన వంశవృక్షానికి భిన్నంగా ఉన్నది. శాసనాన్ని బట్టి వేంగి మండలం వంగిపఱ్రుకు చెందిన వసంతకొట్టూరులోని నిడుగొందిలో కమ్మ బ్రాహ్మణుడు శ్రీవత్స గోత్రీకుడు, పంచార్షేయుడు ఐన మాధవ సోమయాజి ఉండేవాడు. వారి వంశవృక్షం కొంచెం భిన్నంగా, శాసనం, కావ్యంలో ఉంది.
అని ఇలా సాగింది. భీమనయ్యకు అభిమాన దేవరాయ అనే బిరుదము ఉండవచ్చు. శాసనంలో కొమురయ్య తరం తప్పినాడు. పంప, జిన తనయులు గల భీమన తొలుత హిందువు, జైనునిగా మారాక అభిమాన దేవరాయ బిరుదు పొంది ఉంటాడు. జినవల్లభుని తల్లి అబ్బెనబ్బె. ఈమె బెలివొలు సింగన కూతురు. సింగన పేర్లు ధర్మపురిలో నరసింహస్వామిని సూచిస్తున్నది. తల్లి అక్కడిదే ఐతే ఇతడు తెలుగువాడే అనవచ్చును. జైనుడైన పంపడు హిందూధర్మ కేంద్రమైన ధర్మపురిని అగ్రహారంగా కోరుకోవడం వెనుక ఏదైనా మాతృసంబంధం ఉండవచ్చు. పంపని వంశీకులు మూడుతరాల ముందే కరీంనగర్ జిల్లా ప్రాంతమైన సబ్బినాడు (నాటి పేరు) ప్రాంతానికి వలస వచ్చారు. బెళ్వోలము (వెలిపొలము) వెల్గాల, వెలిచాల వంటి గ్రామ నామంగా గుర్తించాలి. లేదా ధార్వాడ ప్రాంతమై ఉండాలి. సిద్ధశిల (సిరిసిల్ల), వంగిపర్రు (వంగపల్లె), నిడుగొండ (నిడిగొండ), గుండి కుర్క్యాలకు 15 మైళ్ల దూరంలోని గ్రామం. ఈ శాసనంలోనివి నేటికి ఈప్రాంతంలో ఉన్నాయి. గుండి నుంచి వలస వచ్చిన బ్రాహ్మణులు నేటికీ ధర్మపురిలో ఉన్నారు. ఇవి కరీంనగర్ జిల్లాలోని గ్రామాలు. కుర్క్యాల శాసనంలో పేర్కొని ఉన్నాయి.
జినవల్లభుని ఈ (శాసన) రచనలో మూడు భాషలు ఉన్నాయి. తెలుగులో మూడు కంద పద్యాలు, కన్నడంలో మూడు కంద పద్యాలు, సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. జినవల్లభుని మరొక రచనయైన ‘మహావీరస్వామి స్ర్తోత్రం’ సంస్కత కావ్యం. ముప్పై శ్లోకాల లఘుకృతి.
పంప మహాకవి, తన తమ్ముడైన జినవల్లభునివలెనే, మరొక శాసన రచయిత. ఆ శాసనం కరీంనగర్ పట్టణానికి తూర్పున గల మానేరు తీరంలోని అరిపణపల్లి (అర్పణపల్లి, అరిపిరాల)లో దొరికింది. ఈ శాసనంలో విక్రమార్జున విజయకావ్యంలోని ఐదు పద్యాలు ఉన్నాయి. ఇది తన ప్రభువు అరికేసరి కోసం రాసింది. నేడిది కరీంనగర్ మ్యూజియంలో ఉన్నది. దీంట్లో నూతలపాడు గ్రామవాసి కౌశిక గోత్రికుడు ధరపయ్యకు అరిపణపల్లిలో 50 మత్తురుల మాగాణి భూమి దానం చేశాడని ఉంది. పంపని మరొక తెలుగు కావ్యంలోనిది ఓ పద్యం దొరికింది. జ్ఞానేంద్ర పురాణంలో ఆ పద్యం వివరాలు ముందు ఉన్నాయి. బెళ్వొల సింగన ధర్మపురిలో స్థిరపడి ఉంటాడు. అతనికి వేంగిపఱ్రు నుంచి వలసవచ్చిన భీమన (భీమనప్ప) ఇష్టుడై అల్లుడైనాడు. తన కూతురు అబ్బెణబ్బెనిచ్చి వివాహం చేశాడు. వంగిపఱ్రు భీమనకు వంగిపఱ్రు పం పన్న, వంగిపఱ్రు జినవల్లభన్న పుట్టారు. జినవల్లభుని తల్లి అబ్బణబ్బె ఈమె పంపన తల్లి కాకపోవచ్చు. తండ్రి ఇద్దరికి భీమనప్పయే. ఒకే తండ్రి ఇద్దరు భార్యల మగ సంతానాలు. వీరిద్దరిని కుర్క్యాల శాసనం, విక్రమార్జున విజయాలను బట్టి నిర్ధారించవచ్చు.
1. జినభవనము లెత్తించుటజినపూజల్సేయుచున్కి జిన మునులకు నత్తిన యన్నదానం బీవుట జినవల్లభు బోలగలగె జినధర్మపరుల్
2. దినకరుసరి వెల్గుదుమని జినవల్లభు నొట్టనెత్తు జితకవి ననమన్ మనుజుల్ గలరే ధాత్రిన్ వినతిచ్చుదు ననియవృత్త విబుధ కవీంద్రుల్
3. ఒక్కొక్క గుణంబు కల్గుదు రొక్కొణ్నిగ కొక్కలక్క లేదెవ్వరికిం లెక్కింప నొక్కలక్కకు మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గుణముల్
(ఈ మూడవ పద్యంలో 2వ పాదంలో యతిలేదు. ‘కన్నడక్కి యతి యిల్ల, కోణక్కి మతి యిల్ల’ అని వారికి పద్యాల్లో యతి ఉండదు.)
జినవల్లభుని అనేక బిరుదములు ఈ శాసనంలో ఉన్నాయి. వాగ్వధూవల్లభ, సకల కళాప్రవీణ, భవ్యరత్నాకర, గుణపక్షపాతి, చతురకవిత్వ రచనాసిద్ధ, బహుకావ్య నిర్మాత, కవితాతత్వశోధక, వాచకాభరణ వంటివి దీనిలో ఉన్నాయి. ఈయన శ్రావ్యగాయకుడు, సంగీత శాస్త్రము బాగా తెలిసినవాడు.
శా. గీతంగాతు మనేక భేద
సుభగం కావ్యాని సోచ్చావచం
వాచా వాచయితుం ప్రియాణి
వదితుం సాధూపకర్తుం సతాం
భోగాన్సేవితుం అంగనారమయితుం
పూజాం విధాతుం జినే
జానీతే జినవల్లభర్ప రమిదం
పంపాభిధానుజుః
జినవల్లభుడు భక్తి, రక్తి రెండూ ఉన్నవాడేనట. సంగీత, సాహిత్యాలు రెంటా మేటియేనట. మధురవాక్కు, సాధుకార్య నిర్వహణలో చతురుడేనట. ఈతనికున్న ‘వాచకాభరణ’ బిరుదునామంతోనే ఈతని సఖుడు, వేములవాడవాసి మల్లియరేచన తన ‘కవిజనాశ్రయమ’నే చందోగ్రంథానికి ఈయన సహాయపడ్డాడని రాసుకున్నాడు. అంతేకాదు. భీమనాగ్ర సుతుడైన పంప మహాకవిని పేర్కొన్నాడు.
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
– ఆచార్య సంగనభట్ల నరసయ్య 9440073124
