సిటీబ్యూరో, ఆగస్టు 9 ( నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డులు సకాలంలో అందక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మూడు రోజులు లేదా వారం రోజుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు వాహనదారుడి చిరునామాకు చేరాలి. కానీ నెలన్నర రోజులు గడిచినా వాహనదారులకు స్మార్ట్ కార్డులు అందడం లేదు. సంబంధిత కార్యాలయాల చుట్టూ వాహనదారులు తమ విధులకు సెలవుపెట్టి తిరగాల్సిన దుస్థితి నెలకొంది. మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యాయలంలో వాహనదారులు ఆర్సీలు, డీఎల్‌ల కోసం నెలన్నర రోజుల నుంచి తిరుగుతున్నారు. అధికారులను సంప్రదిస్తే ఇప్పుడంత సెంట్రల్ పోర్టల్ అయిందని సమయం పడుతుందని చెబుతున్నారు.
ఇదే విధానం ఉంటే కొంతమంది ఏజెంట్ల ద్వారా అదే కార్యాలయంలో కార్డులను వారం రోజుల్లోపే పొందుతున్నారని బాధితులు చెబుతున్నారు. డీఎల్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్స్ వాళ్లే ఒక్కరి దగ్గర రూ.5వేల వరకు వసూలు చేసి శిక్షణతో పాటు డీఎల్ కార్డు ఇప్పిస్తున్నారని తెలిపారు. పోస్టల్ శాఖ ద్వారా చేరాల్సిన కార్డులు కూడా కొందరు ఏజెంట్లు తమ చేతుల్లోకి తీసుకొని వారే నేరుగా వాహనదారులకు ఇస్తున్నారు. దీనిపై పర్యవేక్షించాల్సిన ఆ కార్యాలయ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
గ్రేటర్లో 12 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో 17వేల కార్డులు ప్రింట్ చేయాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. ఒక్క రోజుకు రిజిస్ట్రేషన్ల కోసం ఒక్క కార్యాలయానికి 80 నుంచి 200 వరకు వాహనాలు వస్తుంటాయి. గ్రేటర్లో మేడ్చల్ ప్రధాన కార్యాలయంలో స్మార్ట్ కార్డుల దందా యథేచ్ఛగా సాగుతున్నదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏజెంట్లు ఆ కార్యాలయంలో ప్రత్యామ్నాయ ఆర్టీఓలుగా వ్యవహరిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సేవలు సకాలంలో అందాలన్నా.. కార్డులు వెంటనే పొందాలన్నా వాళ్లు నిశ్చయించిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
శ్రీనివాస్ అనే వ్యక్తి మేడ్చల్ కార్యాలయంలో తన వాహనం రిజిస్ట్రేషన్ చేసుకొని రెండు నెలలకు పైగా అయింది. ఇప్పటికీ అతడికి ఆర్సీ ఇంటికి చేరలేదు. ఈ విషయంపై ఆరా తీయగా అధికారులు కార్డు ప్రాసెస్‌లో ఉందని బుకాయించారు. మరో వ్యక్తి ప్రమీల తనకు నెల గడుస్తున్నా కార్డు అందలేదు. ఆమె అక్కడే తిష్టవేసిన ఏజెంట్లను ఆశ్రయించడంతో వాళ్లడిగిన డబ్బులు ముట్టజెప్పి అదే రోజు కార్డు పొందింది. ఇక చేసేదేమిలేక వాహనదారులందరూ ఏజెంట్లను ఆశ్రయించే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్మార్ట్ కార్డుల జారీని పారదర్శకంగా నిర్వహించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.