ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పాలనపై తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఒక ప్రయత్నం చేసింది. ‘మూడ్ ఆఫ్ తెలంగాణ’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై అభిప్రాయాలను సేకరించింది. మొత్తం ఐదు ప్రశ్నలు అడుగగా.. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
పాలన తీరుతోపాటు, మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై కాంగ్రెస్ చేసిన దాడియత్నం, నోరుతెరిస్తే కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్న కాంగ్రెస్ నేతల తీరుపై ప్రజల స్పందన, మొత్తంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలన బాగుందా? ఇప్పుటి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన బాగుందా? వంటి అంశాలపై ప్రశ్నించారు. వీటికి ముక్తకంఠంతో ‘రేవంత్ పాలన కంటే కేసీఆర్ పాలనే బాగున్నది’ అంటూ సర్వేలో పాల్గొన్న ఘంటాపథంగా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, మెజారిటీ జనం బీఆర్ఎస్ వైపే చూస్తున్నారన్న విషయం రూఢీ అయ్యింది.

(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, హామీల ఎగవేతలు, క్షుద్ర రాజకీయాలు, మహిళా ఎమ్మెల్యేలపై దుశ్శాసన పర్వం, పాలనా వైఫల్యాలు, సమన్వయం లేని క్యాబినెట్, చేయిదాటిపోయిన అధికార యంత్రాంగం, నీళ్ల కోసం, కరెంటు కోసం రోడ్డెక్కుతున్న రైతులు, నీళ్లు లేక, పెట్టుబడి సాయం అందక మళ్లీ బీళ్లువారుతున్న పొలాలు, బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. ఇవీ కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో తెలంగాణలో కనిపిస్తున్న దుర్భర పరిస్థితులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదేదో చేస్తామని నమ్మబలికి, అరచేతిలో వైకుంఠం చూపించారు. కేసీఆర్ పథకాల కన్నా మెరుగైనవి అమలు చేస్తామంటూ గప్పాలు కొట్టారు.
ఈ మాయమాటలను నమ్మి ప్రజలు అధికారాన్ని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారు. అదే తాము చేసిన అతిపెద్ద తప్పిదమని మెజారిటీ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు తమ జీవితాలు నానాటికీ దుర్భరం అవుతున్నాయని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నారు. ఒకప్పుడు పచ్చని పంటలతో కళకళలాడిన తెలంగాణ నేడు క్రాప్ హాలిడేలతో కళావిహీనం కాగా, పెట్టుబడి సాయం అందక, సమయానికి పంటకొనుగోళ్లు లేక అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ మహిళలు, యువత, ఆటోడ్రైవర్లు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అన్ని రంగాల ప్రజలు నిలదీస్తున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిసారీ 22ఏ తరహాలో కొత్త వివాదాన్ని తెరమీదికి తెస్తున్నారు. ప్రజలు ప్రతి అంశాన్నీ గంభీరంగా, క్షుణ్ణంగా, లోతుగా పరిశీలిస్తున్నారు. గత పాలనకు, ఇప్పటికి బేరీజు వేసుకుంటున్నారు. భవిష్యత్తుకోసం ఆలోచిస్తున్నారు.

కొడంగల్‌లో రేవంత్‌కు షాక్
సర్వే ఫలితాలను గమనిస్తే వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ఎంత డిజాస్టర్ అయ్యిందో, ప్రజలు ఏ స్థాయిలో కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారో తేలిపోతుంది. సర్వేలో ‘సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరు ఎలా ఉన్నది? ఎన్నికల హామీలను అమలు చేశారా?’ అనే ప్రశ్నకు.. రేవంత్ పాలన బాగాలేదని, హామీల అమలు జరుగలేదని 74.64 శాతం మంది తేల్చి చెప్పారు. 19.1 శాతం మంది మాత్రమే రేవంత్‌రెడ్డి పాలన బాగున్నదని కితాబిచ్చారు. దీనిని బట్టే ఎన్నికల ముందు అలవిగాని హామీలు గుమ్మరించారనేది స్పష్టమైంది. ఇక రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ విధానాలు ఎలా ఉన్నాయన్న ప్రశ్నకు.. సరిగా లేవంటూ 71.33 శాతం మంది పేర్కొన్నారు.
దీంతో అంతర్గత కుమ్ములాటలు, ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రదక్షిణలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ల మధ్య వైరాలతో ప్రజలు విసిగిపోయారనేది తేలిపోయింది. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ చావును కోరుకోవడంపై ప్రజల అభిప్రాయాన్ని కోరగా.. ఏకంగా 92.87 శాతం మంది ఇది సరైన పద్ధతి కాదంటూ కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ నేతల దాడి యత్నాన్ని 84.21 శాతం మంది ప్రజలు ఖండించారు. మొత్తంగా అప్పటి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పాలన బాగుందా? లేక, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన బాగుందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. 72.82 శాతం మంది గత కేసీఆర్ పాలనకే జైకొట్టారు. రేవంత్ పాలన బాగున్నదంటూ కేవలం 16.62 శాతం మంది పేర్కొనగా, 10.57 శాతం మంది తెలియదు/ఏమీ చెప్పలేమని అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనను ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలు కూడా మెచ్చుకోవడం లేదు. ఇదేం పాలన అంటూ అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. కొడంగల్‌లో మొత్తం 179 మందిని ప్రశ్నించగా.. రేవంత్ పాలనతీరు బాగోలేదని 76 శాతం మంది పేర్కొన్నారు. రేవంత్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలు సరిగా లేవంటూ 68.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రేవంత్ పాలనతో పోలిస్తే, గత కేసీఆర్ పాలనే బాగున్నదంటూ 64.2 శాతం మంది పేర్కొన్నారు. కేసీఆర్ నివాసంపై దాడిని ఖండిస్తున్నామంటూ 84.4 శాతం మంది కొడంగల్ ప్రజలు తేల్చి చెప్పడం విశేషం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ చావును కోరుకోవడాన్ని 95 శాతం మంది సరైన పద్ధతి కాదంటూ పేర్కొన్నారు.


కాంగ్రెస్‌పై గ్రేటర్లో పెదవి విరుపు!
కాంగ్రెస్ పాలనపై గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా అసహనంతో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 26 నియోజకవర్గాల్లో 25 చోట్ల సర్వే నిర్వహించగా 3,882 మంది పాల్గొన్నారు. రేవంత్ పాలన తీరు బాగోలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని 74.82 శాతం మంది గ్రేటర్ ప్రజలు అభిప్రాయపడగా, గత కేసీఆర్ పాలనే బాగున్నదంటూ 73.01 శాతం మంది పేర్కొన్నారు. సీఎం రేవంత్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలను 69.35 శాతం మంది వ్యతిరేకించినట్టు సర్వేలో వెల్లడైంది.


మంత్రుల ఇలాకాలో అసమ్మతి సెగలు
ప్రశ్న 1: సీఎం రేవంత్ రెడ్డి పాలనతీరు ఎలా ఉంది? ఎన్నికల హామీలు అమలు చేశారా?
ప్రశ్న 2: సీఎం రేవంత్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై మీ అభిప్రాయం ఏమిటీ?
ప్రశ్న 3: కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మరణాన్ని కోరుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటీ?
ప్రశ్న 4: కేసీఆర్-బీఆర్ఎస్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి-కాంగ్రెస్ పాలన బాగుందా?
ప్రశ్న 5: కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ చేసిన దాడియత్నం మీద మీరేమంటారు?
మిగతా కాంగ్రెస్ మంత్రుల నియోజకవర్గాల ప్రజలు సైతం కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సర్వేలో తేలింది. మిగతా మంత్రులకు చెందిన 11 నియోజకవర్గాల్లో 3,075 మందిపై సర్వే నిర్వహించగా.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో పోలిస్తే, గత కేసీఆర్ పాలనే బాగున్నదంటూ 69.56 శాతం మంది పేర్కొన్నారు. రేవంత్ పాలన తీరు బాగోలేదని, హామీల అమలు కూడా జరుగలేదని 71.77 శాతం మంది వెల్లడించారు. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ విధానాలు కరెక్ట్ కాదని 67.44 శాతం మంది పేర్కొనగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ చావును కోరుకోవడాన్ని 93.41 శాతం మంది తప్పుబట్టారు. అంతేకాదు, కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని 84.48 శాతం మంది వ్యతిరేకించారు.
మధిరలో ఇలా.. పాలేరులో అలా..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో, రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గం పాలేరులోనూ కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పడిపోయినట్టు సర్వేలో తేలింది. రేవంత్ పాలన బాగాలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదని మధిరలో 74.1 శాతం మంది పేర్కొనగా, పాలేరులో 58.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో పోలిస్తే, గత కేసీఆర్ పాలనే బాగున్నదంటూ మధిరలో 70.9 శాతం మంది అభిప్రాయపడగా, పాలేరులో 53.9 శాతం మంది కేసీఆర్ పాలనకు జై కొట్టారు. రేవంత్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలు కరెక్ట్ కాదని మధిరలో 70.9 శాతం మంది తెలుపగా, పాలేరులో 53.5 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ చావును కోరుకోవడాన్ని 82.4 శాతం మంది మధిర ప్రజలు, 91.1 శాతం మంది పాలేరు ప్రజలు తప్పుబట్టారు. కేసీఆర్ నివాసంపై దాడిని 73 శాతం మంది మధిర ప్రజలు, 83 శాతం మంది పాలేరు ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు.