స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 12 : ‘నా పే రు ఆకుల లక్ష్మీనారాయణ.. మాది జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్పల్లి. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. మా గ్రామానికి చెందిన సింహాద్రి వద్ద పెద్దనాన్న చిన్న గట్టయ్య భూమి కొనుగోలు చేశా రు. దానిని నేను 50 ఏండ్ల క్రితం కొనుగోలు చేసి నా భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించిన. అటు తరువాత నాకున్న భూమిని ఇద్దరు కొడుకులకు పంచగా, నేను కొనుగోలు చేసిన భూమిని పెద్ద కోడలు స్వర్ణలతకు ఇస్తే ఆమె పేరుపై చేయించుకున్నారు. ఇన్నేండ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకుంటున్న భూమి ఇప్పుడు 22ఏ (నిషేధిత జాబితా)లో ఉందంటూ కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.
దీంతో ఏం చేయాలో అర్థం కావడంలేదు. మా గ్రామంలోనే 30 మందికి పైగా రైతులం ఇప్పటివరకు మూడుసార్లు కోర్టుకు పోయినం. మేం ప్రభుత్వ భూములను ఆక్రమించుకోలేదు. మా భూములను సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఇన్నేండ్ల తర్వాత మా భూములను 22ఏలో చేర్చి కో ర్టుల చుట్టూ తిప్పడం వల్ల మానసికంగా ఎం తో ఇబ్బంది పడుతున్నం. వ్యవసాయం చేసుకోవాల్సిన మేము కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తదని కలలో కూడా అనుకోలే. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యను అర్థం చేసుకొని 22ఏలో ఉన్న మా భూములను పరిశీలించి, వాటిని ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేసి మనశ్శాంతి కల్పించాలి’ అన్ని 22ఏ బాధిత రైతు వేడుకుంటున్నాడు.