దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు. స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. పద్మాలను సమర్పించారు, పుష్పార్చనలు చేశారు. ఏకంగా చంద్రుణ్ని తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు. అయినా గణపతికి వేడి తగ్గలేదు. చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడి శిరస్సుపై ఉంచాడు. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి, గడ్డి పోచకూ లంకె కుదిరింది. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ, సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన. అందుకే దూర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై, శీఘ్ర ఫలితం ఇస్తాడని విశ్వసిస్తారు.
దైనందిన కార్యక్రమాలు, సృష్టి కార్యాలు నిరాటంకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి.
ఆసురీ ప్రవృత్తులను, భయాల్ని తొలగించే ఈ గణపతి ఏకదంతుడు. భక్తులకు సమయజ్ఞతను ఇస్తాడు. వ్యాసుడు భారతం చెబుతుండగా.. ఘంటం విరిగిపోతే, తన దంతాన్ని పెకలించి, దానితో రాతను కొనసాగించాడట గణపతి. అలా ఏకదంతుడయ్యాడని పురాణ కథనం.
దుష్ట శక్తులను, శత్రువులను ఎదుర్కొనే సాహస సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు ఉద్దండ గణపతి.
సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడీ స్వామి.
రెండు ముఖాలు కుడి ఎడమలకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు.
కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ ప్రమథ గణనాథుడు భక్తులకు శుభాలను, సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు.
ఈ గణపతి కీర్తి ప్రతిష్ఠలు, పదవులు, సత్కారాలు అందజేస్తాడు.
భక్తులను ధైర్యవంతులుగా చేసి, ఆత్మవిశ్వాసంతో వారిని ముందుకు నడిపిస్తాడు సింహ గణపతి.
సకల పాపాలను దూరం చేసి, ఉపాసకులను ఈ దుర్గ గణపతి కంటికి రెప్పలా కాపాడతాడు.
ఈ గణపతి యోగమూర్తి. మూలాధార స్థితుడైన జప, తప, ధ్యాన తత్పరుడు. బ్రహ్మజ్ఞానానికి యోగ గణపతి ప్రతీక. ఆయురారోగ్య ప్రదాత.
భక్తుల సంకటాలన్నీ హరించే కరుణమూర్తి ఈయన. సంతోషం, ఆనందంతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి సంకటహర గణపతి.
అకార, ఉకార, మకారాల స్వరూపంగా కుడి ఎడమలకు రెండు ముఖాలు. మధ్యన ముఖ్య శిరస్సుతో త్రిముఖ గణపతి కనిపిస్తాడు. కరుణ, జాలితో దీనులను, నిస్సహాయులను కరుణిస్తూ ఉంటాడు.