హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల అనుచరుల పేర్లతో పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. శనివారం శాసన మండలిలో ‘టీజీఐఐసీ ద్వారా పరిశ్రమలకు అనుమతులు’ అనే అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ పారిశ్రామికవేత్తను గన్‌తో బెదిరించిన విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి కూతురు ఆరోపించినట్టు ఆయన గుర్తుచేశారు. కేన్స్ సెమికాన్ గుజరాత్‌కు, రూ.1,000 కోట్ల పెట్టుబడి గల కార్నింగ్ ఇంటర్నేషనల్ కంపెనీ తమిళనాడుకు, ప్రీమియం ఎనర్జీస్, సిగాచి ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయని తెలిపారు.
రాష్ట్రంలో టీజీఐఐసీ.. తెలంగాణ ఇందిరమ్మ ఇండస్ట్రియల్ కార్పొరేషన్లా మారిందని ఆయన దుయ్యబట్టారు. టీహబ్ ఎదురుగా రూ.750కోట్ల విలువైన మూడెకరాల స్థలాన్ని హోటల్ ఇండస్ట్రీకి ప్రైవేట్ బిజినెస్ చేసుకోవాలని, సర్వీస్ అపార్ట్మెంట్లు కట్టుకోవాలని 33 ఏండ్లకు లీజు రూపంలో ధారాదత్తం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ భూమి లీజు వ్యవహారంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ స్థలానికి సమీపంలో టీజీఐఐసీ వేలంలో ఎకరానికి రూ. 260 కోట్ల చొప్పున 5 ఎకరాల భూమిని ప్రెస్టీజ్ సంస్థ దక్కించుకున్నట్టు వెల్లడించారు. ఎస్బీఐకి కేటాయించిన భూమిని సైతం అధికారులను బెదిరించి అమ్ముకున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో టీజీఐఐసీ ద్వారా 50 ఎకరాలు, 100 ఎకరాలను అడ్డగోలుగా అనర్హులకు భూములను కేటాయిస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలుతుందని నాడు సమైక్య పాలకులు భయపెట్టేవారని పోచంపల్లి గుర్తుచేశారు. కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన టీఎస్ ఐపాస్ తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిందనని వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు రావడంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం చెప్పారని గుర్తుచేశారు.
2024లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన టీచర్ నియామకాల్లో జాతీయ క్రీడాకారులకు అన్యాయం జరిగినట్టు పోచంపల్లి ఆందోళన వ్యక్తంచేశారు. 100 పోస్టులను స్పోర్ట్స్ కోటాకు కేటాయించగా 33 మంది జిల్లాస్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలు కట్టబెట్టి మిగిలిన 67 పోస్టులను జాతీయ క్రీడాకారులకు ఇవ్వకుండా ఓపెన్ కోటాకు బదలాయించినట్టు పేర్కొన్నారు.