హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర పరువు తీసేలా అసలైన లైంగిక వేధింపులకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోని పోలీసు యంత్రాంగం, అసెంబ్లీ వద్ద ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై మాత్రం కక్షగట్టి తప్పుడు లైంగిక వేధింపుల కేసులు బనాయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యంపై నల్ల టీషర్టులతో తాము శాంతియుతంగా అసెంబ్లీ వద్ద నిరసన తెలుపుతుంటే, మహిళా కానిస్టేబుల్‌ను అడ్డం పెట్టుకొని తనతో పాటు హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలపై అసభ్య ప్రవర్తన కల్పిత కేసులు నమోదు చేయడం పోలీసుల దిగజారుడుతనానికి పరాకాష్ట అని శనివారం సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులే స్వయంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి దిగారని ధ్వజమెత్తారు.
ఆమె ఆరోపణలను ఎవరు తొక్కిపెట్టారు?
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ అందాల పోటీల సందర్భంగా ‘మిస్ ఇంగ్లండ్’ మిల్లా మాగీ కొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి పోటీ నుంచి అర్ధాంతరంగా వైదొలగిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. పోటీలకు నిధులు సమకూర్చిన ప్రభావవంతమైన వ్యక్తులతో, అధికార కాంగ్రెస్ నాయకులను అలరించాలని తనను ఒత్తిడి చేశారని, తీవ్రమైన వేధింపులతో పాటు, మహిళగా తాను తట్టుకోలేని వ్యతిరేక పరిస్థితులు ఎదురయ్యాయని ఆ మిస్ వరల్డ్ పోటీదారు బహిరంగంగా ఆరోపించి దేశం విడిచి వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఒక విదేశీ మహిళ రాష్ట్రంలో పర్యటిస్తూ ఇలాంటి వేధింపులపై గళమెత్తితే, బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కంటితుడుపు విచారణ జరిపి ‘ఆధారాలు లేవు’ అని కేసును బుట్టదాఖలు చేశారని పేర్కొన్నారు.
విపక్ష నేతలపై తప్పుడు కేసులు
పోలీసుల ద్వంద్వ వైఖరిపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసలైన వేధింపుల బాధితురాలు ‘మిస్ ఇంగ్లండ్’ చేసిన ఫిర్యాదుపై ఎలాంటి సమగ్ర దర్యాప్తు చేయకుండా కాంగ్రెస్ పెద్దలను కాపాడిన పోలీసులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విపక్ష ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు ఎలా బనాయిస్తారని నిలదీశారు. మహిళల రక్షణ, న్యాయం గురించి దేశవ్యాప్తంగా ప్రసంగాలు దంచికొట్టే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణలో తమ పార్టీ నేతల వేధింపులను తొకిపెట్టడంపై ఏం సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చిన కాంగ్రెస్ నేతల లైంగిక వేధింపుల వ్యవహారంపై నిజాయితీగా విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం
అసెంబ్లీ వద్ద ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు లైంగిక వేధింపుల కేసులు పెట్టడంపై తాను షాక్‌కు గురయ్యానని కేటీఆర్ వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై తప్పుడు లైంగిక వేధింపుల కేసులు బనాయించించారని మండిపడ్డారు.
కేటీఆర్ చొరవతో జైలు నుంచి విముక్తి
ఆపదలో అండగా నిలిచి.. మలేషియా జైలు నుంచి విడుదలకు కృషిచేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బాధిత యువకుడు శివ కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన శివ సూరినేని హోటల్ మేనేజ్మెంట్ పూర్తిచేసి ఉపాధి కోసం 2022 నవంబర్‌లో ఓ ఏజెంట్ ద్వారా మలేషియాకు వెళ్లాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన పనిచేస్తున్న ఇండియన్ గేట్ రెస్టారెంట్లో ఇమిగ్రేషన్ అధికారులు దాడులు చేశారు. శివ నకిలీ ఇమిగ్రేషన్‌తో మలేషియాలో పనిచేస్తున్నాడని జైలుకు పంపారు. శివ దయనీయస్థితిని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ద్వారా కేటీఆర్‌కు వివరించారు. దీంతో కేటీఆర్ మలేషియా బీఆర్ఎస్ నేతల ద్వారా అక్కడి ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి జైలు నుంచి విడుదల చేయించారు. ఈనెల 9న ఇంటికి చేరుకున్నాడు. శనివారం శివ తన తండ్రి రవీందర్రావు, సోదరుడు వినోద్‌తో కలిసి తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.