హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత జరిగిన శాసనసభ సమావేశాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన హైకమాండ్ రంగంలోకి దిగి, శుక్రవారం ఆమెను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని కోరడం, మరుసటి రోజే ఢిల్లీకి రావాలని పిలువడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది.
శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, కొండా సురేఖతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని, అధిష్ఠానం అండగా ఉంటుందని ఆమెకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ నుంచి పిలుపు రావడం గమనార్హం. అధిష్టానం కొండా సురేఖకు క్యాబినెట్ హోదా స్థాయిలో ఆర్టీసీ చైర్మన్ పదవిని అప్పగించే అవకాశాలున్నట్టు సమాచారం. అధిష్ఠానం పిలుపు మేరకు కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లారు.