సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను కలుషిత తాగునీరు కలవరపెడుతున్నది. గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జలమండలి వ్యాప్తంగా తాగునీరు సరఫరా అవుతున్నది. పలుచోట్ల నల్లా నీళ్లు మురుగు, దుర్వాసనతో వస్తుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు కాలనీలు, బస్తీల ప్రజలు డయేరియా బారిన పడుతున్నామని వాపోతున్నారు. జలమండలి వ్యాప్తంగా వర్షాకాలం యాక్షన్ ప్లాన్ ప్రణాళికాబద్ధంగా, పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలమండలి పైపులైన్లకు లీకేజీలను ఎక్కడికక్కడ వదిలేస్తుండటంతో వరదనీరు, వర్షపునీరు కలుస్తూ మురుగునీళ్లు సరఫరా అవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, జలమండలి అధికారుల అలక్ష్యంతో లీకేజీలను అరికట్టలేకపోతున్నారు.
జలమండలి పరిధిని విస్తరించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాను మాత్రం గాలికొదిలేశారని విలీన గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. విలీన గ్రామాలతో పాటు గ్రేటర్ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కలుషిత నీటితో పాటు లోప్రెషర్, సరఫరాలో అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జోన్ పరిధిలోని పాతబస్తీ పరిధిలోని మెజార్టీ ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీల వల్ల వర్షపునీరు జలమండలి నీటిలో కలిసి కలుషితమవుతున్నాయి.
అదేవిధంగా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోజుల తరబడిగా నిల్వ ఉండటంతో మురుగు చేరుతున్నది. ఖైరతాబాద్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, బోరబండ, రహ్మత్‌నగర్, నందినగర్‌లో కలుషిత నీరు ప్రజలను వేధిస్తున్నది. మల్కాజిగిరి జోన్ పరిధిలోని నగర శివారు ప్రాంతాలైన బోడుప్పల్, కాప్రా, చిలుకనగర్, పీర్జాదిగూడలో నీటి కొరత వేధిస్తున్నది. దీనికి తోడు ఆయా ప్రాంతాల్లో రంగు మారిన నీళ్లు సరఫరా అవుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సైబరాబాద్ ప్రాతంలోని కొండాపూర్, ప్రేమ్‌నగర్, పాపారెడ్డి కాలనీ, నార్సింగి పరిధిలోని కోకాపేట, గండిపేట, మణికొండ, పుప్పాలగూడలో మురుగు నీరు సరఫరా అవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పాపిరెడ్డి కాలనీలో మూడేండ్లుగా మురుగునీరు
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌లోని పాపిరెడ్డి కాలనీ జలమండలి వినియోగదారులకు మూడేండ్లుగా మురుగు నీరు సరఫరా అవుతున్నది. కాలనీలో మూడు వందల మంది జలమండలి వినియోగదారులు ఉన్నారు. వర్షం పడితే నల్లానీళ్లు మురుగు, దుర్వాసనతో సరఫరా అవుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 6 వరకు వస్తాయి. మొత్తం మురుగు దుర్వాసనతో వస్తున్నాయి. లైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు. సంబంధిత మేనేజర్‌కు కాలనీ వాసులంతా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువవుతున్నది. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇదే పరిస్థితి నగర వ్యాప్తంగా తాండవిస్తున్నది.