కూసుమంచి, జనవరి 10: ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని, ఆరు గ్యారెంటీల అమలులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాట నిలబెట్టుకొని వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో తొలుత ఆయన మాట్లాడారు. ప్రజాపాలన దరఖాస్తులన్నీ ఆన్లైన్ అవుతున్నాయని అన్నారు. అవి పూర్తయిన వెంటనే అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చామని, మిగిలిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని అన్నారు. తమ హామీలన్నీ ఆచరణ సాధ్యమైనవేనని అన్నారు.
వానకాలం నాటికి ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలను అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీతారామ ప్రాజక్టుతో ఉమ్మడి జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్పష్టమైన ఆలోచనలో ఉందని అన్నారు. వైరా, లంకాసాగర్ల కింద ఆయకట్టుకు వచ్చే వానకాలం నాటిని గోదావరి జలాలను అందిస్తామని అన్నారు. అలాగే ఈ నెల ఆఖరు నాటికి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమ చేస్తామని అన్నారు. సీతారామ ప్రాజెక్టుతో పాలేరును అనుసంధానం చేయడం వల్ల నాగార్జున సాగర్‌తో పని లేకుండానే గోదావరి జలాలతో జిల్లాను సమశ్యామలం చేయాలనేదే తన జీవిత లక్ష్యమని అన్నారు. అందుకోసం మంత్రులు పొంగులేటి, ఉత్తమ్లతో కలిసి సమీక్షించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పూర్తిగా నివేదిక ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. నిధుల విషయంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో చర్చించినట్లు తెలిపారు.
కూసుమంచిలో నూతనంగా ప్రారంభమైన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటిని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ సునీల్‌దత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సుమారు 20 నిమిషాల పాటు మంత్రితో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.