తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు గల ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి. పట్టణాలు, నగరాల్లో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకునేవే అయినా రాష్ట్రంలో, కేంద్రంలోని పాలకపార్టీలకు బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాయని స్పష్టమవుతున్నది.
గత డిసెంబర్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు కోటిన్నర మంది ఓటర్లు తమ విలక్షణ తీర్పు చెప్పారు. అధికార పార్టీకి విపక్షాల కంటే తక్కువ శాతం ఓట్లు వచ్చాయి. ప్రజావ్యతిరేకత దృష్ట్యా రెండేండ్లపాటు జాప్యం చేసి చివరికి భయభయంగానే ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పెద్దలకు ప్రజలు ముచ్చెమటలు పట్టించారు. ఎన్నికల ప్రచారానికి సీఎం దిగినా ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఆలోచనను మానుకొని పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం పూనుకున్నది. వీటి ఫలితాలపైనా కాంగ్రెస్‌లో ఆందోళన నెలకొన్నది. రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారం చేశారు.
నగరాలు, పట్టణాలపై నిర్లక్ష్యం: కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో పల్లెలతోపాటు పట్టణాలు, నగరాలు కూడా ప్రగతికి నోచుకోలేదు. ఎన్నికల నిర్వహణలో జాప్యం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. అమృత్, స్మార్ట్‌సిటీ పథకాలు కొండెక్కాయి. ఏ నగరం, పట్టణం చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రధానంగా తాగునీరు ప్రజలకు సరిగా అందడం లేదు. కొత్త రోడ్ల నిర్మాణం నిలిచిపోయింది. రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఎక్కడ చూసినా గుంతలు, గోతులే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తున్నది. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. వీధి దీపాలు వెలుగక కారుచీకట్లు అలుముకుంటున్నాయి. బస్స్టేషన్లు, బస్స్టాండ్లు అధ్వానంగా మారాయి. చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. పార్కుల నిర్వహణ గాలికి వదిలేశారు. కాలుష్యం కోరలు చాచింది. వానలు, వరదలు వస్త్తే నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారుతున్నాయి. బస్తీల పేదలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హైడ్రాతో పేదల గుడిసెల తొలగింపు కార్యక్రమం చేపట్టింది. కొత్త రేషన్‌కార్డులు అర్హులందరికీ అందడంలేదు.
పట్టణ పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన రెండు లక్షల డబుల్ బెడ్రూమ్లు సిద్ధంగా ఉన్నా కేసీఆర్‌కు పేరు వస్తుందనే కారణంతో వాటిని పేదలకు ఇవ్వకుండా రేవంత్ సర్కార్ తాళాలు వేసింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులేమీ విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది. రెండేండ్లలో నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు స్తంభించిపోయాయి. శాస్త్రీయత లేకుండా నగరపాలక సంస్థల విస్తరణ, శివారు గ్రామాల విలీనం చేపట్టింది. హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ బలంగా ఉండడం, అత్యధిక శాతం ఎమ్మెల్యేలు ఆ పార్టీ వారే కావడంతో నగరం స్వరూపాన్ని దెబ్బతీసేందుకు రేవంత్ ప్రభుత్వం పూనుకున్నది. నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, కార్యాచరణ లోపించడం వల్ల దీనిపై తీవ్ర గందరగోళం నెలకొన్నది. మహానగర విస్తరణ అంటూ గ్రామాలను కలిపేయడం వల్ల ఉపాధి హామీ వంటి గ్రామీణాభివృద్ధి పథకాలు నిలిచిపోయే పరిస్థితిని పాలక ప్రభుత్వం తీసుకువచ్చింది.
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పంథా: కేసీఆర్ ప్రభుత్వం పట్టణాలు, నగరాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది విశ్వనగర ఖ్యాతి పొందింది. ఇతర నగరాలు, పట్టణాల్లో మంచినీటి సరఫరాను మెరుగుపర్చింది. పారిశుద్ధ్య సేవలకు ప్రాధాన్యమిచ్చింది. ‘పారిశుద్ధ్య కార్మికులకు సలాం’ అంటూ వారికి వేతనాల పెంపుతోపాటు సంక్షేమానికి చర్యలు తీసుకున్నది. మైట్రో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఫ్ల్లైైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పెద్దఎత్తున సాగింది. రహదారులు మెరుగుపడ్డాయి. బస్తీలు ప్రగతి బాట పట్టాయి. బస్తీ ప్రజల కోసం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. మురికివాడల్లో పేదలకు ఇంటిపన్ను, నల్లా పన్నును మినహాయించారు. హరితహారం కింద మొక్కల పెంపకం పెద్దఎత్తున చేపట్టగా నగరాలు, పట్టణాల్లో పచ్చదనం పెరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంతా తలకిందులైంది. హైదరాబాద్ మహానగరంతో పాటు ఇతర నగరాల్లో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ గాని, అండర్ పాస్ గాని నిర్మాణం చేపట్టలేదు. కొత్తగా ఇంటి, నల్లా బిల్లుల పెంపునకు రంగం సిద్ధం చేసింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది. మెట్రో రైల్ రెండో దశకు సరైన కార్యాచరణ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన పలు పనులకు కాంగ్రెస్ పాలకులు ప్రారంభోత్సవాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల బాధలను సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు వినడంలేదు. తిట్లతోనే ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు.
వైఫల్యాల ఘోష: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు నానాఅవస్థలు పడుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణను అన్నివిధాలుగా చిన్నచూపు చూస్తున్నది. ఇటీవల బడ్జెట్లో తెలంగాణకు కేటాయించింది శూన్యం. కొత్తగా నిధుల కేటాయింపులు, పథకాలు లేవు. హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణకు నిధులు ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ తదితర నగరాలకు ప్రత్యేక రైళ్లు అవసరమైనా వాటిని పట్టించుకోవడం లేదు. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం లాంటి కీలక ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్రం గాలికి వదిలేసింది.
గుణపాఠం తప్పదు: కాంగ్రెస్ రెండేండ్ల్ల పాలన ఆ పార్టీ దుస్థితిని తేటతెల్లం చేస్తున్నది. బీజేపీ కూడా తెలంగాణపై కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో గత డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఆ రెండు పార్టీలపై వ్యతిరేకతను చాటాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పడం ఖాయం. ఈ ఎన్నికల ఫలితాలు ‘మా అభిప్రాయాలు, మనోభావాలు ఇవి… ఇకనైనా మారండి’ అంటూ పాలకులను మేల్కొలిపేదిగా, ప్రజాచైతన్యానికి ప్రతీకగా నిలువాలి. ఓటును బ్రహ్మాస్త్రంగా ప్రయోగించినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రజలు నిరూపించాలి.
– డాక్టర్ బీఎన్ రావు