భద్రాచలం, ఆగస్టు 30 : ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతున్నది. శనివారం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ఉదయం 6 గంటలకు 46.50 అడుగులు, 10 గంటలకు 47 అడుగులు, మధ్యాహ్నం ఒంటిగంటకు 47.30, సాయంత్రం 4 గంటలకు 47.40 అడుగులు, రాత్రి 10 గంటలకు 47.50 వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తున్నది. ఎగువన పేరూరు వద్ద వరద ప్రవాహం నిదానంగా ఉండడం.. శ్రీరాంసాగర్, ఇంద్రావతి ప్రాజెక్టుల్లో వరద కూడా తగ్గడంతో గోదావరి వరద ప్రవాహం కొంతమేరకు పెరిగి నిలకడగా ఉండొచ్చని సీడబ్ల్యూసీ, ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు.
అధికారులు మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వరద క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మురుమూరు వద్ద, తూరుబాక వద్దకు గోదావరి వరద చేరడంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అలాగే చర్ల-వెంకటాపురం గ్రామాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద స్నానాలఘాట్ నీటమునగగా.. కల్యాణ కట్టను ఆనుకుని గోదావరి ప్రవహిస్తున్నది.