బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 11 : ఎగువ ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నది. మంగళవారం రాత్రి 11 గంటలకు 49.50 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం ఉండగా.. బుధవారం ఉదయం 7 గంటలకు 50.30 అడుగులకు చేరింది. ఉదయం 9 గంటలకు 50.60 అడుగులకు చేరుకుని.. 11 గంటల నుంచి గంట గంటకూ తగ్గుతూ ఉంది.
రాత్రి 10 గంటలకు 47.10 అడుగుల వద్ద నిలకడగా ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చర్ల మండలంలోని తాలిపేరు వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. పేరూరు వద్ద కూడా గోదావరి ప్రవాహం తగ్గింది. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద 48.40 అడుగుల మేర ప్రవాహం ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. రాత్రికి మరింతగా వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.