కొత్తగూడెం సింగరేణి, జూన్ 24 : సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే విధంగా, అలాగే నైనీ సమీపంలో నిర్మించ తలపెట్టిన థర్మల్‌ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం కేటాయింపు కోసం సంస్థ సీఎండీ బలరాం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇందుకోసం సోమవారం ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ జైన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నైనీ బ్లాక్‌కు సంబంధించి అన్ని అనుమతులు లభించిన విషయాన్ని, రెండో దశ అటవీ అనుమతుల్లో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా సింగరేణి చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా వన్యప్రాణి సంరక్షణ ప్రణాళికలో పొందుపర్చినట్లుగా రూ.39 కోట్లను కూడా డిపాజిట్ చేశామని, దీంతో ఇప్పటివరకు రూ.180 కోట్లు పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించినట్లు వెల్లడించారు. ఆయనవెంట నైనీ జీఎం శ్రీనివాసరావు, జీఎం ఎస్టేట్స్ బండి వెంకటయ్య, చీఫ్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్ విశ్వనాథరాజు, ప్రాజెక్టు ఆఫీసర్ మజుందార్, ప్రవీణ్ కశ్యప్ ఉన్నారు.