భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో సర్పంచ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తండాలు కొత్త పంచాయతీలుగా అవతరించడంతోపాటు అభివృద్ధిలో కొత్త రూపును సంతరించుకున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చిన గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 370 మందికి పైగా కొత్త కార్యదర్శులు కొలువుదీరారు. గతంలో 276 పాత పంచాయతీలు ఉండగా.. కొత్తగా 205 కొత్త పంచాయతీలుగా మార్చి.. మొత్తం 481 పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించిన ఘనత గత కేసీఆర్ సర్కారుకే దక్కింది. అంతేకాక అభివృద్ధిలో పంచాయతీలను అగ్రభాగాన నిలిపేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్, నీటి ట్యాంకర్, పల్లె పకృతి వనం ఏర్పాటు చేసింది.
మరుగునపడ్డ పంచాయతీ వ్యవస్థకు గత కేసీఆర్ సర్కారు జవసత్వాలను తీసుకొచ్చింది. ప్రతి పంచాయతీకి ప్రత్యేక నిధులను కేటాయించి పరిపాలనను ప్రజల ముంగిటకు చేర్చింది. పల్లెల్లో రోడ్ల వెంట దారిపొడవునా పచ్చని మొక్కలను నాటి గ్రీన్ భద్రాద్రిగా మార్చిన చరిత్ర గత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది.
ఐదేళ్లపాటు పల్లెల్లో సుపరిపాలన అందించిన సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కావడంతో బుధ, గురువారాల్లో జిల్లావ్యాప్తంగా పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించి వారి అనుభవాలను పంచుకున్నారు. కొత్తగా వచ్చిన సర్కారు సర్పంచ్ల స్థానంలో తొలుత ప్రత్యేకాధికారులుగా ఉద్యోగులను నియమించాలని అనుకున్నా.. చివరి నిమిషంలో గెజిటెడ్ అధికారులను నియమించాలని భావించింది. ఎంపీడీవో, డీటీ, సీడీపీవో, ఏఈ, డీఈఈ, ఏవో, వెటర్నరీ అధికారులను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించింది.
గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో పల్లెలకు కొత్త రూపు వచ్చింది. శ్రీనగర్ కాలనీ పంచాయతీ అవుతుందని అనుకోలేదు. గల్లీలన్నీ సీసీ రోడ్లు అయ్యాయి. ప్రతి రోడ్డులో నీడనిచ్చే చెట్లు ఏపుగా పెరిగాయి. ఇదంతా గత కేసీఆర్ సర్కారు కృషి ఫలితమే అని చెప్పాలి.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు పాలన దగ్గరైంది. ప్రతి పల్లె అభివృద్ధి చెందింది అంటే అది గత కేసీఆర్ ప్రభుత్వ గొప్పతనమే అని చెప్పాలి. సర్పంచ్, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చారు. దాని వల్ల నిధుల వినియోగం పారదర్శకంగా జరిగింది.
బుధవారంతో గ్రామపంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది. ఇక ప్రతి పంచాయతీకి గెజిటెడ్ అధికారిని నియమించాం. వారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు కూడా ఇచ్చాం. జిల్లావ్యాప్తంగా 481 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాం.