పత్తి రైతులకు మేలు చేయాల్సిన భారత పత్తి సంస్థే(సీసీఐ) రైతులను దగా చేస్తున్నది. దళారుల భారిన పడకుండా ఆదుకోవాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నామమాత్రంగా వ్యవహరిస్తున్నది. పత్తి కొనుగోళ్లలో సీసీఐ వ్యవహారం ఆద్యంతం వివాదాస్పదం అవుతూనే ఉన్నది. దీంతో దళారులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారవుతున్నది. పత్తి రైతులను దళారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ ఆఖరు నుంచి జిన్నింగ్ కేంద్రాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లకు సీసీఐ రంగం సిద్ధం చేస్తున్నది.
అయితే, జిన్నింగ్ మిల్లులతో టెండర్ ప్రక్రియ ఖరారు కాకపోవడంతో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. కొనుగోళ్లలో సీసీఐ పాత్ర నామమాత్రం కావడంతో దాదాపు 90 శాతం పత్తిని దళారులు గ్రామాల్లోనే కొంటున్నారు. మద్దతు ధరకే కొనుగోలు చేస్తామనే సీసీఐ భరోసాను ఇవ్వకపోవడంతో గ్రామాల్లో దళారులు చెప్పిన ధరకే అమ్మి రైతులు మోసపోతున్నారు. రాష్ట్రంలో పత్తి సాగులో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు అవుతుండగా.. అందులో లక్షకుపైగా హెక్టార్లలో పత్తి పంట సాగవుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు లక్షన్నర మంది రైతులు ఈ పత్తి సాగుపైనే ఆధారపడి ఉన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏటా అక్టోబర్ నాటికే పత్తిని తీసి పంట విక్రయించేందుకు పత్తి రైతులు సిద్ధమవుతారు. ఆ దిశగా మార్కెటింగ్ శాఖ అధికారులు, సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉంటారు. అయితే ఈ ఏడాది వ్యవసాయ అధికారుల నుంచి మార్కెటింగ్ శాఖ అధికారులకు క్రాప్ బుకింగ్ డేటా రాకపోవడంతో పత్తి కొనుగోళ్లు కొంత ఆలస్యం అయ్యే అవకాశం కన్పిస్తోంది. అంతేగాక సీసీఐకి, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలకు మధ్య ఏర్పడిన గ్యాప్ కారణంగా మరింత ఆలస్యమయ్యే ప్రమాదం కన్పిస్తోంది.
ఈ తరుణంలో జిన్నింగ్ మిల్లులతో టెండర్ ప్రక్రియ ఫైనల్ అవలేదని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో పత్తి సాగయ్యే ప్రతి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అధికారులు మాత్రం కొన్నిచోట్ల మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల్లోని రైతులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాల్సి వస్తున్నది. ప్రతి నియోజకవర్గంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పత్తి రైతులు మొరపెట్టుకుంటున్నా అటు సీసీఐ అధికారులుగానీ, ఇటు మార్కెటింగ్ అధికారులుగానీ, చివరికి ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదు.
జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పత్తి రైతులు నిలువునా దగా పడుతున్నారు. వ్యాపారులు, దళారులు అక్కడే తిష్టవేసి నాసిరకం పేరుతో సీసీఐ నిరాకరించిన పత్తిని అగ్గువకు కొనుగోలు చేస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు అనుకూలమైన ప్రాంతాల్లో కాకుండా దూరాభారాన్ని కలిగించే ప్రాంతాల్లో సీసీఐ అధికారులు ఏర్పాటు చేస్తుండడంతో రైతులు ఆ దూర ప్రాంతాలకు వెళ్లలేక, ఖర్చులను భరించలేక, మరోదారి లేక గ్రామాల్లోనే దళారులకు అమ్ముకుంటున్నారు. దీంతో దళారులు, వ్యాపారులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు.
తక్కువ తూకం వేయడంతోపాటు తాము చెప్పిన ధరకు కొనుగోలు చేస్తామని, లేకపోతే కొనుగోలు చేయబోమని రైతులకు తెగేసి చెబుతున్నారు. దీంతో మరోదారి లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సీసీఐ నిర్ణయించిన మద్దతు ధరకు కాకుండా సుమారు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తక్కువ చేసి కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత ఆ సాయంత్రమే అదే పత్తిని తిరిగి దళారులు సీసీఐకే మద్దతు ధరకు అమ్ముకొని లాభపడుతున్నారు. సీసీఐ నిబంధనలతో 90 శాతం మంది రైతులు పత్తిని వెనక్కి తీసుకెళ్లి గ్రామాల్లోనే దళారులకు అమ్మేస్తున్నారు.