మధిర, ఆగస్టు 11: కాంగ్రెస్ పాలనలోనే కరువొస్తుంటుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కంటే ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా కరువు వచ్చిందని జ్ఞప్తికి తెచ్చారు. ‘ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు గుర్తుకు లేదా?’ అంటూ విమర్శించారు. అలాగే, మధిర నియోజకవర్గం ఇప్పటివరకు కరువు ప్రాంతంగా ఉండడానికి కాంగ్రెస్ పాలకులే కారకులని స్పష్టం చేశారు. మధిరలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు ఇటీవల వంగవీడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చి చిలకపలుకులు పలికారని వివర్శించారు. దానిని మరో జాలిముడి ప్రాజెక్టుగా తయారు చేయొద్దని సూచించారు.
వంగవీడు లిఫ్ట్‌ను రూ.630 కోట్లతో నిర్మించి 33 వేల ఎకరాలకు నీరందిస్తామని మంత్రులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అన్ని ఎకరాలకు సాగునీరు అందించాలంటే మాజీ సీఎం కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టుతోనే సాధ్యమని అన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారానే మధిర, వైరా ప్రాంత రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందని వివరించారు. కేసీఆర్‌కు ఎకడ మరింత మంచి పేరొస్తుందోనన్న అక్కసుతోనే ఈ ప్రాంత పంట భూములకు సీతారామ ద్వారా సాగునీరు సరఫరా అవుతున్న విషయాన్ని మంత్రులు చెప్పలేదని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనపై పదేపదే పసలేని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. గతంలో రూ.100 కోట్లతో జవహర్ జాలిముడి ప్రాజెక్టు నిర్మించినప్పటికీ ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించిన పరిస్థితి లేదని విమర్శించారు.
వంగవీడు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి ఒక ఎకరాకు సాగునీరు అందించేందుకు రూ.2 లక్షల ఖర్చు వస్తుందని అన్నారు. మరి కాంగ్రెస్ పాలకులు ఈ ప్రాజెక్టును ఎవరి కోసం నిర్మిస్తున్నారనే విషయాన్ని రైతులు, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హెలీపాడ్ పకనే వంద పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ కనీసం అది ఎలా ఉందో కూడా మంత్రులు చూడకుండా వెళ్లడం బాధాకరమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, శీలం కవిత, బొగ్గుల భాసర్‌రెడ్డి, అరిగే శ్రీనివాసరావు, చావా వేణుబాబు, శ్రీనివాసరెడ్డి, వంకాయలపాటి నాగేశ్వరరావు, అప్పారావు, ఇక్బాల్, భోగ్యం ఇందిర, సేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, సంక్రాంతి కృష్ణారావు, వీరారెడ్డి, ఆళ్ల నాగబాబు, కందుకూరి నాగబాబు, కోటేశ్వరరావు, ఖురేషి, చీదిరాల రాంబాబు, గుగులోత్ కృష్ణ, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.