సత్తుపల్లిటౌన్, ఆగస్టు 10 : ప్రత్యేక అధికారాలు ఇచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేసిందే గత కేసీఆర్ ప్రభుత్వమని, దీంతోనే గ్రామాల్లో సుపరిపాలన అందిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం జరిగిన ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ విరమణ అభినందన కార్యక్రమంలో సండ్ర ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐదేళ్ల పదవీ కాలంలో సభ్యులు నిస్వార్థంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని అభినందించారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లో దేశంలో 20 పంచాయతీలకు.. 12 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్తమ పంచాయతీలుగా ఎంపికయ్యాయని గుర్తు చేశారు. 11 మున్సిపాలిటీలు దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీలుగా ఎంపికయ్యాయని తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో పారిశుధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. పదవీ విరమణ పొందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
గత సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు పనులను 90 శాతం పూర్తి చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 10 శాతం పనులు చేసి తామే ప్రాజెక్టును తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా 35 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. సీఎం సహాయ నిధి కింద గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు తప్ప ప్రస్తుతం కొత్తగా ఎవరికీ సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కులు పంపిణీ చేయడం లేదన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పగుట్ల వెంకటేశ్వరరావు, దొడ్డా హైమావతి శంకర్రావు, మాజీ జడ్పీటీసీ కూసంపూడి రామారావులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు రఫీ, ఏన్కూరు నాయకులు వెంకటరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్‌పాషా పాల్గొన్నారు.