ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఉద్యమనేత కేసీఆర్.. సీఎం హోదాలో గతంలోనే అప్పటి ప్రధాని మోదీకి వినతిపత్రం ఇచ్చారని గుర్తుచేశారు.
1965లో లాల్ బహదుర్ శాస్త్రి మంత్రివర్గంలో ఎస్సీ వర్గీకరణకు తొలి అడుగులు పడ్డాయని జ్ఞప్తికి తెచ్చారు. 1995లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మేరీ అనే యువతి ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ భవనంపై నినాదాలు చేసిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు బెల్లం వేణు, ఉప్పల వెంకటరమణ, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, నెమలి కిశోర్, హెచ్చు ప్రసాద్, వీరభద్రం, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.