సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 9 : మున్సిపాలిటీ పరిధిలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి 17వ వార్డు అభ్యర్థి కొత్తూరు తులసితో కలిసి ఆ వార్డులో సోమవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ గతంలో ఉన్న షాదీఖానా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అత్యాధునిక సౌకర్యాలతో షాదీఖానా నిర్మాణం కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన పూర్తి చేశామని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయని విమర్శించారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద ముస్లింలను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. సండ్ర వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు.