ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 9 : కష్టాల్లో ఉన్న మున్నేరు వరద బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. జలగంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, మాజీ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
వరద తగ్గిన తర్వాత ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలు అందించడంతోపాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయంపై సైతం కొట్లాడుతుందన్నారు. ఈ సందర్భంగా కందాల, చిరాగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తయారు చేయించిన నిత్యావసర సరుకుల కిట్లను బాధిత కుటుంబాలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మరింత సాయం చేసి ముంపు బాధితులకు మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మున్నేరుకు ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.650 కోట్లు మంజూరు చేయడంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిందన్నారు. ఆ పనులను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సుడా మాజీ డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్‌నాయక్, పార్టీ మండల కార్యదర్శి పేరం వెంకటేశ్వర్లు, నేలకొండపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, నాయకులు ముత్యం కృష్ణారావు, దర్గయ్య, అక్కినపల్లి వెంకన్న, వీరభద్రం, శ్రీను, నాగేశ్వరరావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.