కూసుమంచి, డిసెంబర్ 28: కార్యకర్తలే గులాబీ పార్టీకి బలమని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. తాను కూడా ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తానని, పాలేరులో మూడు లక్షల మంది ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానని అన్నారు. కూసుమంచి మండలంలో బీఆర్ఎస్ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లకు చేగొమ్మ గ్రామంలో ఆదివారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 40 శాతానికిపైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని అన్నారు. గెలిచినవారందరూ గ్రామాల్లో కష్టపడి పని చేయాలని సూచించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనందున ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కూడా నిరుత్సాహ పడకుండా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉన్నానని, పాలేరు ప్రజల్లో ఒకడిగా ఉంటున్నానని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలు ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, ఇంటూరి శేఖర్, అలవల లింగయ్య, రామిరెడ్డి, సర్పంచ్‌లు బాణోత్ మహేశ్, భూక్యా శిరీష, కొలిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మండలంలో పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు వీరస్వామి, బాణోత్ మహేశ్, తంగెళ్ల లక్ష్మయ్య, గుగులోత్ మాధవి, భూక్యా శిరీష, అనుష, కొలిశెట్టి శ్రీను, వసంతలక్ష్మి, దాట్ల సతీశ్, బాణోత్ భిక్షం, కొండా సైదులు తదితరులను ఎమ్మెల్యే సన్మానించారు.