ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 5 : వరద ముంపు బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, అధికారం లేకపోయినా మీకు అండగా ఉంటూ.. నావంతు సాయం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మున్నేటి ముంపు ప్రాంతాలైన జలగంనగర్, నాయుడుపేట, ఇందిరమ్మకాలనీ, దానవాయిగూడెం కాలనీలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి గురువారం పర్యటించారు.
వరద ఉధృతి తగ్గిన తర్వాత వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై ఆరా తీశారు. అనంతరం ఆయా డివిజన్లలో కందాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాలను కందాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలేరు ప్రజలు ఎప్పటికి నా కుటుంబమేనని, వారు ఆపదలో ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటానని అన్నారు.
రూ.10 వేల ప్రభుత్వ సాయం పట్ల ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరన్నారు. కనీసం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం చేయాలని కందాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో కొట్లాడి వరద బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు వీరభద్రం, మానుకొండ శ్రీను, కనకయ్య, మేకల ఉదయ్, బానోత్ కృష్ణ, గడ్డా వీరన్న పాల్గొన్నారు.