ఖమ్మం రూరల్, మే 7 : మన జిల్లా సమస్యలు పరిష్కారం కావాలన్నా.. మన రాష్ట్రం తరఫున ప్రతినిధిగా పార్లమెంట్లో గొంతుక వినిపించాలన్నా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నామా నాగేశ్వరరావును ఆశీర్వదించాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఏదులాపురం, ముత్తగూడెం, ఆరెకోడు, కాచిరాజుగూడెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లిన కందాల తొలుత కూలీల సమస్యలు, ఎండ తీవ్రత, పనివేళలు తదితర విషయాలపై ఆరా తీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలేరు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కందాల మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ ఒక్కటే ఎజెండా కాదని, వారి మాటలు నమ్మితే మరింత గోస పడుతామన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాలేరు ప్రజలు మరోసారి ప్రలోభాలకు గురి కావొద్దని ప్రత్యేకంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్నాయక్తోపాటు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.