ఇల్లెందు, మే 19: పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటుతో దీవించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఇల్లెందులో పర్యటించి పట్టభద్రులతో సమావేశం కానున్న నేపథ్యంలో స్థానిక జేకే కాలనీ సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో సంబంధిత ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను ఎన్నికల అనంతరం విస్మరించిందని విమర్శించారు. ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తగిన బుద్ధిచెప్పాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, లక్కినేని సురేందర్, పరుచూరి వెంకటేశ్వర్లు, సిలివేరి సత్యనారాయణ, జేకే శ్రీను, శీలం రమేశ్, వరప్రసాద్, అంతోటి అచ్చయ్య, తాత గణేష్, రేణుక, కృష్ణారావు, నబి, మహేందర్, రాజేశ్, చాంద్, ప్రమోద్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.