ఇల్లెందు, నవంబర్ 27: గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి బానోతు హరిప్రియానాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు శీలం రమేశ్ అధ్యక్షతన గురువారం జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన హరిప్రియానాయక్ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని సూచించారు. ప్రస్తుత కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో, సమష్టిగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ముఖ్య నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.