ఇల్లెందు, జూలై 5: ఇల్లెందు నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ అన్నారు. ఆదివారం ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు చెందిన బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు.
ఎన్యూమరేషన్ ఫారాల నింపడంపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ సర్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ తమ పరిధిలోని పోలింగ్ బూత్‌లో జరిగే సర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగేందుకు, కొత్త ఓటర్ల నమోదు, సవరణలు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా మహిళా ఓటర్ల విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, ఏ ఒక్క అర్హుడు ఓటుహక్కును కోల్పోకుండా బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని తెలిపారు.
ప్రతి అర్హుడికి ఓటుహక్కు- ప్రతి ఓటుకు రక్షణ అనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు సిలివేరు సత్యనారాయణ, టేకులపల్లి బేతంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, ఇల్లెందు పట్టణ నాయకులు జేకే శ్రీను, పాబోలు కిరణ్, నెమలి ధనలక్ష్మి, తోట లలిత, శారద, కొక్కు సరిత, గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్, ఎస్కే చాంద్‌పాషా, మీర్జా, నెమలి నిఖిల్, బీపీఎన్ రాథోడ్ పాల్గొన్నారు.