భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ)/ ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో శిరీష ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కార్యాలయ పరిసర ప్రాంతాల్లో వద్ద హైడ్రామా జరిగింది. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సినీ ఫక్కీలో అవిశ్వాస తీర్మాన సమావేశానికి వస్తున్న కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్‌ను అపహరించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన మరో ఐదుగురు కౌన్సిలర్లను ప్రత్యేక క్యాంప్‌నకు తరలించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే కోరం కనకయ్య నోరు మెదపలేదని, చూస్తూ ఉండిపోయారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల అద్దాలు పగులగొట్టి విధ్వంసానికి పాల్పడినా తమను దూషించినా పోలీసులు చూస్తూ ఉండిపోయినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం పట్టణంలో ప్రదర్శనగా వెళ్లి కిడ్నాప్‌కు గురైన కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు భార్య వెంకటలక్ష్మితో కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరుల ఆగడాలు, అరాచకాలపై ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్‌కు గురైన కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును కొన్ని గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు తిరిగి ఇల్లెందు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట వదిలిపెట్టినట్లు సమాచారం. సదరు కౌన్సిలర్‌ను ప్రత్యేక వాహనంలో భద్రాచలం పట్టణానికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. కౌన్సిలర్ భార్య వెంకటలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం అందుకుని కౌన్సిలర్‌ను విడిచిపెట్టినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కిడ్నాప్‌కు గురైన కౌన్సిలర్ కూడా తిరిగి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తున్నది.
మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు గూండాగిరి చేసి బీఆర్ఎస్కు అనుకూలమైన కౌన్సిలర్లను బెదిరించారు. గూండాగిరి చేసి ఒక కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే దురాగతాలపై తాము గతంలోనూ కోర్టులను ఆశ్రయించాం. కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరం. దీనిపై భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్‌రాజు సమాచారం ఇచ్చాం. వారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.