ఖమ్మం, సెప్టెంబర్ 2 : భారీ వర్షానికి తోడు ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. కనీవినీ ఎరుగని రీతిలో నగరంలో జలప్రళయం సృష్టించింది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో బడుగు జీవులను బజారున పడేసింది. పోటెత్తిన వరద ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఒక్కసారిగా వచ్చిన భారీ వరదతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న కాలనీవాసులు, తల్లులు చంటి పిల్లలను చంకలో వేసుకుని బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు.
విలువైన వస్తువులు, సామగ్రిని వదిలి కట్టుబట్టలతో ఇళ్లు వదిలి పారిపోయారు. ప్రతి ఒక్కరిని కదిలించే ఈ ఘటన ఖమ్మం నగరంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చోటు చేసుకుంది. వర్షం వదిలి 24 గంటలు దాటినా పాలకులు, జిల్లా యంత్రాంగం వారికి తినడానికి తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా అందించలేదు. అక్కడక్కడా స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయం తప్ప ఇతరత్రా ఎలాంటి సహాయానికి ముంపు బాధితులు నోచుకోలేదు.
మున్నేరు నది పరీవాహక ప్రాంతాలైన నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, మాణిక్య నగర్, గణేశ్ నగర్, మోతీ నగర్, మంచికంటి నగర్, దానవాయిగూడెం కాలనీ, ధంసలాపురం కాలనీలు దాదాపు ఆరు డివిజన్లు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధికంగా నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ జీవిస్తుంటారు. ఎక్కవగా చిరు వ్యాపారులు, కూరగాయల, వ్యవసాయ మార్కెట్, గాంధీచౌక్ ఏరియాల్లో హమాలీలుగా, దుకాణాల్లో గుమస్తాలుగా, పండ్ల దుకాణాల్లో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటారు. రోజువారీగా నాలుగు చక్రాల బండ్లపై పల్లీలు, మొక్కజొన్న కంకులు, పండ్లు, కూరగాయలు విక్రయిస్తుంటారు.
వీరితోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు జీవిస్తుంటారు. అయితే మున్నేరు వరద వారి జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రతి ఇంటిని వరద ముంచెత్తింది. కొన్నిచోట్ల రెండంతస్తుల ఇళ్లు కూడా వరదతో నిండిపోయాయి. చేసేది లేక ఇళ్లు వదిలి బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో కొందరు తలదాచుకున్నారే తప్ప మెజార్టీ ప్రజలు వారి బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఇలాంటి దుర్భర పరిస్థితులను తమ జీవితంలో ఇంతవరకు చూడలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ప్రాణాలు దక్కించుకున్న ఆ ప్రాంత ప్రజలు సోమవారం ఉదయం కన్నీటితో వారి ఇళ్లకు చేరుకున్నారు.
ముంపు ప్రాంతాల్లో ఒక్కొక్కరిది ఒక్కో దీన గాధ. వర్షం, వరద ఉధృతి తగ్గడంతో ఇళ్లకు చేరుకున్న వారు బురదతో నిండిపోయిన ఇంటిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విలువైన టీవీలు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, మంచాలు, పరుపులు, ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, బీరువాలు, టేబుళ్లు, ఫ్యాన్లు, కుర్చీలు, గ్యాస్ పొయ్యిలు, సర్టిఫికెట్లు, ఫోన్లు, వాచీలు, పుస్తకాలు, వంట సామగ్రి, నిల్వ పచ్చళ్లు, డబ్బులు, బంగారు నగలు, విలువైన దుస్తులు మొత్తం వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని ఇంట్లోనే బురదలో కూరుకుపోయాయి. కట్టుబట్టలతో బయటకు రావడంతో ప్రస్తుతం కట్టుకోవడానికి దుస్తులు లేక బంధువుల ఇళ్ల నుంచి తెప్పించుకుంటున్నారు.
మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పలువురి వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వీటిలో బైక్‌లు, ఆటోలు, కార్లు, ట్రాలీ ఆటోలు, తోపుడు బండ్లు ఉండగా.. ఇదే ప్రాంతంలో లారీల కార్యాలయం కూడా ఉంది. ఇక్కడ లారీలు నిలిచి ఉండడంతో అవి కూడా నీటిలో మునిగిపోయాయి. వరదతో తడిచిపోయి స్టార్ట్ కావడం లేదు. కిరాణా దుకాణాల్లోని సరుకులు, మెడికల్ షాపుల్లోని మందులు, ఆయిల్ క్యాన్లు, మోటర్లు మొత్తం పాడైపోయాయి. దీంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.
మున్నేరు వరద తగ్గిపోయినా బురద మాత్రం ఆ ప్రాంతంలో మోకాలి లోతులో ఉంది. రోడ్లు, ఇళ్లు బురదతో నిండిపోయాయి. ఇంట్లో పాడైన వస్తువులను ఇంటి ముందు పెట్టుకొని బోరున విలపిస్తున్నారు. ఇళ్లలోని బురదను శుభ్రం చేసుకోవడానికి కూడా నీళ్లు లేని దుస్థితి. తినడానికి తిండి లేదు. తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు పస్తులతోనే గడిపారు. చిన్నపిల్లలను బంధువుల ఇళ్లలో ఉంచి పెద్దవాళ్లు మాత్రమే ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
మున్నేరుకు వరద రావడం కొత్తేమీ కాదు. గత ఏడాది కూడా మున్నేరు నది 32 అడుగుల మేర ప్రవహించింది. అయితే అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రతి ఇంటికి సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. అదే ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే అప్రమత్తమై ఇంట్లోని వస్తువులను కాపాడుకునేవారు. అధికారుల నిర్లక్ష్యంతోనే భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రజలు భావిస్తున్నారు. తమ ప్రాంతాలకు వస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై ముంపు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోయిన ఏడాది వరదలు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయనే మా దేవుడు. ఆయన వెంటనే పువ్వాడ అజయ్‌కుమార్‌ను పంపి మాకు అండగా ఉంచారు. ఎలాంటి ప్రాణ నష్టం కాదు కదా.. కనీసం ఆస్తి నష్టం జరగలేదు. వరదలు వస్తాయని ముందే చెప్పడం ద్వారా మా ఆస్తులను కాపాడుకునే వాళ్లం. గత ఏడాది ముందు సమాచారం ఇవ్వడం వల్ల మా సరుకులు, వస్తువులను ట్రాక్టర్లలో తీసుకెళ్లి నయాబజార్ కళాశాలలో ఉంచాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వరధలు వస్తాయని ఏ ఒకడు చెప్పకపోవడం వల్లనే మాకు ఇంత నష్టం జరిగింది. దీనిని ఎవరు భరించాలి?
-నాళం విజయలక్ష్మి, ఖమ్మం
ఖమ్మం ఎమ్మెల్యేగా అజయ్‌కుమార్ ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. పోయిన సంవత్సరం వరదలు వస్తే మా తోటే ఆయన ఉండి మాతోటే తిన్నాడు. నాయకుడు అంటే అలా ఉండాలి. ఇప్పుడు మమ్ముల్ని పట్టించుకునే వాడే లేడు. రాత్రిపూట వరద వస్తుందని మాకు చెప్పినట్లయితే మా ఆస్తులను పోగొట్టుకునే వాళ్లం కాదు. అధికారులు కానీ, నాయకులు కానీ ప్రజలకు మంచి చేయాలి తప్ప నష్టం జరిగాక వచ్చి ఫొటోలుకు ఫోజులు ఇవ్వడం ఇవ్వడం వల్ల మాకు ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు మమ్ముల్ని కాపాడేది ఎవరు.
-జ్యోతి, చంటి పాప తల్లి, ఖమ్మం
జిల్లాలో ముగ్గురు మంత్రులు పేరుకే ఉన్నారు. కానీ వారి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. వరదలు వస్తాయని ముందే అధికారులు వారికి చెప్పలేదా? చెబితే వాళ్లు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ల బంధువులో, వాళ్ల కుటుంబ సభ్యులో ఉంటే ఇలాగే చేస్తారా? చెప్పండి. ఓట్లప్పుడు నీతి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలకు కష్టాలు రాగానే కనబడకుండా పోయేవాళ్లని అనవసరంగా ఎన్నుకున్నాం. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి మా బతుకుల్ని మేమే పాడు చేసుకున్నాం. ప్రజలతో ఉండి ప్రజల కోసం కష్టపడే వాళ్లని ఎన్నుకోకపోవడం వల్లనే మాకే నష్టం జరిగింది.
– నసీమా, వెంకటేశ్వర నగర్
భారీ వర్షం కురిసి ఇబ్బందుల్లో ఉన్నా ఇంతవరకు ఒక అధికారిగానీ, మంత్రిగానీ మా వైపు చూడలేదు. మేము తిన్నామా, చచ్చమా అని కూడా పట్టించుకోలేదు. ప్రజలకు కష్టం వస్తే అండగా ఉండేవాడే నాయకుడు. అంతా అయిపోయాక వచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఏమీ లేదు. ఇకనైనా పాలకులకు బుద్ధి రావాలి.
-పార్వతి, ఖమ్మం కాల్వొడ్డు
రెండు రోజుల నుంచి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. వరద వచ్చి ఇల్లు, వాకిలి వదిలిపెట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టాం. ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తే కన్నీళ్లు తప్ప మిగిలేది మిగిలింది ఏమీ లేదు. రెండు రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నాం తిండి పెట్టేవాడు లేడు.. నీళ్లు ఇచ్చేవాడు లేడు. చీకట్లో మగ్గుతున్నాం
-అంగోతు సత్తెమ్మ, ఖమ్మం కాల్వొడ్డు