ఖమ్మం సిటీ, జనవరి 25: ‘టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గెలిపించింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ఐదేండ్లు అన్నిరకాల వైభోగాలు అనుభవించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన మీరు.. కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు? ఎవరి కోసం చేరారు?’ అంటూ కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కేఎంసీ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎండీ ఖమర్, డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బుల్ సూటిగా ప్రశ్నించారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ‘మీరు కాంగ్రెస్‌లో చేరింది స్వప్రయోజనాల కోసమా? ప్రజల అభ్యున్నతికా?’ అని నిలదీశారు. ఇటీవల ఖమ్మం నగరంలోని 17, 34 డివిజన్లలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సభల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా మాట్లాడలేదని అన్నారు. కేవలం కొందరి వ్యవహార శైలి, కాంగ్రెస్ విధానాల మీదనే మాట్లాడారని అన్నారు.
పార్టీలు మారిన వారంతా ఆరు గ్యారంటీలను, 420 హామీలను అమలు చేయించి ప్రజలకు న్యాయం చేయాలని సూచించిన సంగతిని గుర్తుచేశారు. కానీ, ‘గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారు’ అనే చందంగా పార్టీ ఫిరాయింపుదారులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఖమ్మం అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికి ఎన్ని పార్టీలు మారారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. ‘2014లో టీడీపీ, 2018లో టీఆర్ఎస్, 2023లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదా?’ అని ప్రశ్నించారు. రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది ఎవరో నగర ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.
గడిచిన రెండేళ్లలో ఖమ్మం అభివృద్ధికి కాంగ్రెస్ పాలకులు, మంత్రి తుమ్మల ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చేసిన అభివృద్ధిని, నిధుల మంజూరును నేటి పాలకులు వారి ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘రెండేళ్లలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకోదగ్గ పనిచేశారా?’ అని ప్రశ్నించారు. నగరాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, యువ నేత కేటీఆర్ సహాయ సహకారాలతో రూ.వేల కోట్ల నిధులు తెచ్చి.. అప్పటికే కాంగ్రెస్ మిగిల్చిన దరిద్రాన్ని శుభ్రంగా కడిగిన చరిత్ర అజయ్దని స్పష్టం చేశారు.
లకారం ట్యాంక్‌బండ్, కొత్త కలెక్టరేట్, కొత్త బస్టాండ్, కొత్త మున్సిపల్ కార్యాలయం, వేలాది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, డివిజన్ల వారీగా పార్కులు, ప్రజలకు మౌలిక వసతులు వంటి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పూర్తి చేయించామని గుర్తుచేశారు. ఇప్పుడు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం నత్తను తలపిస్తోందని, వంద మీటర్ల సైడు కాల్వ నిర్మాణం దరఖాస్తును పట్టించుకున్న నాథుడే లేడని విమర్శించారు. కనీసం కార్పొరేటర్ల గౌరవ వేతనం కూడా చెల్లించలేదని దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.
క్రితం సారి అసెంబ్లీ ఎన్నికల వేళ ఖమ్మం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చి.. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు ఓట్లు అడగాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుదారులను ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మసలు కోవాలని హితవు చెప్పారు. మాజీ మంత్రి అజయ్‌కుమార్ జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కేఎంసీ కార్పొరేటర్ బుర్రి వెంకట్, బీఆర్ఎస్ బీసీ సెల్ నగర అధ్యక్షుడు మేకల సుగణారావు, ప్రచార కార్యదర్శి షేక్ షకీనా, నాయకులు పాషా, ఆరెంపుల వీరభద్రం, నెమలి కిషోర్, కందాల వీరేందర్, షేక్ ఉస్మాన్, సత్తార్ మియా, మోటే కుమార్ తదితరులు పాల్గొన్నారు.