బూర్గంపహాడ్, జూన్ 20 : పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ శాఖ అధికారులు వెళ్లడంతో గిరిజన మహిళలు, అటవీ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికారులు గిరిజన మహిళలపై దాడి చేయడంతోపాటు దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన బూర్గంపహాడ్ మండలం ఇరవెండి బీట్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోసుగుంపు గ్రామంలోని పోడు సాగుదారులకు చెందిన భూముల్లోకి అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లి కందకాలు తీయిస్తుండగా గిరిజన మహిళలు అడ్డుకున్నారు.
దీంతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాడికి దిగడంతోపాటు దుస్తులు చింపి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని గిరిజన మహిళలు ఆరోపించారు. 25 ఏళ్లుగా 100 ఎకరాల్లో పోడు సాగు చేసుకుంటున్న తమను అటవీ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, జేసీబీతో వచ్చి దౌర్జన్యం చేశారని, అడ్డుకున్న తమను దారుణంగా కొట్టారని వాపోయారు.
ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు మహిళలు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా అటవీ అధికారులు నాగరాజు, రాంబాబు, సిబ్బంది బాబురావు, రమేశ్‌లు ఫోన్లు లాక్కొని వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తూ పోడు చేసుకుంటున్నామని, తమకు ఆధార్, రేషన్, ఓటరు కార్డులు ఉన్నాయని తెలిపారు. తమపై అటవీ శాఖ అధికారులు దాడి చేసిన విషయంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళలు తెలిపారు. దీనిపై అశ్వాపురం రేంజర్ రమేశ్‌ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా.. అందుబాటులో లేరు.