అశ్వారావుపేట, నవంబర్ 16: అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో వేసుకున్న గుడిసెలను శనివారం అటవీ శాఖ అధికారులు తొలగించడంతో ఆగ్రహించిన గిరిజనులు వినాయకపురం-మామిళ్లవారిగూడెం రహదారిపై బైఠాయించారు. వినాయకపురానికి చెందిన పలువురు గిరిజనులు సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న దమ్మపేట, అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజర్లు కరుణాకరాచారి, మురళి తమ సిబ్బందితో శనివారం ఘటనా స్థలానికి చేరుకుని గుడిసెలను తొలగించారు.
ఈ క్రమంలో అటవీ అధికారులతో గిరిజనులు వాగ్వాదానికి దిగడంతో ఐదుగురిని అదుపులోకి తీసుకొని దమ్మపేట అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు వినాయకపురం-మామిళ్లవారిగూడెం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై యయాతి రాజు అక్కడకు చేరుకుని గిరిజనులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న గిరిజనులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్కడి నుంచి దమ్మపేట రేంజ్ కార్యాలయానికి చేరుకున్న గిరిజనులు అటవీ అధికారులతో చర్చలు జరిపారు. తాము ఆక్రమించిన భూమి రెవెన్యూ శాఖకు చెందిందని గిరిజనులు చెబుతుండగా.. అటవీ శాఖ అధికారులు మాత్రం తమ శాఖకు చెందిన భూమి అని పేర్కొంటున్నారు.