భద్రాద్రి కొత్తగూడెం, జూలై 18 (నమస్తే తెలంగాణ): పోడు భూమి వివాదంలో ఆదివాసీ ఆడబిడ్డలను అటవీ శాఖ సిబ్బంది తరిమితరిమి కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చిఈడ్చి మరీ కొట్టడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులపాడు పంచాయతీ వేములూరు గ్రామంలో ఆదివాసీలు చాలా ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీ శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు 50 మంది సిబ్బందితో వచ్చి జేసీబీతో ఆ భూముల్లో ట్రెంచ్ కొడుతున్నారు. దీంతో ఆదివాసీలు మా భూముల్లో ట్రెంచ్ ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించడంతో అటవీ శాఖ బీట్ ఆఫీసర్ శ్యామ్ తోటి సిబ్బందితో కలిసి వారిపై దాడిచేసి కొట్టారు. ఆదివాసీ మహిళ మడకం గంగమ్మను బలంగా కొట్టడంతో అక్కడే పడిపోయింది. మరో నలుగురు ఆడవాళ్లను సైతం కిందపడేసి కొట్టారు. చేసేదేమీ లేక ఆదివాసీ బిడ్డలు ఇంటిముఖం పట్టారు.

వేములూరు గ్రామంలో పన్నెండేళ్లుగా నివాసం ఉంటున్నామని స్థానిక ఆదివాసీలు సాంబశివ, కాలేటి రాము, సవలం జ్యోతి, సీతమ్మ, సాయమ్మలు అశ్వాపురంలో శనివారం విలేకరుల ఎదుట వాపోయారు. ఇంతకాలం మమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదని, మాపై అకారణంగా దాడి చేశారన్నారు. ఆదివాసీలంటే అంత చులకనా? ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఈడ్చిఈడ్చి మరీ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీలపై అటవీ సిబ్బంది దాడులు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో పోడు సాగుదారులకు పట్టాలిచ్చి సాయం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలపై దాడులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేత, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. బాధ్యులైన అటవీ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో బూర్గంపహాడ్ మండలంలో కూడా ఇలానే దాడులు చేశారని, అటవీ అధికారుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువయ్యాయన్నారు. అశ్వాపురం మండల బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.

అశ్వాపురం, జూలై 18: ఫారెస్టు అభివృద్ధే తమ లక్ష్యమని ఎఫ్డీవో బాబు స్పష్టం చేశారు. అశ్వాపురం ఫారెస్టు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములూరు గ్రామంలో ఫారెస్టు భూమి ఆక్రమణకు ప్రయత్నించడమే కాకుండా తమ విధులను ఆటంకపర్చిన 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మణుగూరు రేంజర్ ఉపేందర్, అశ్వాపురం రేంజర్ సత్తాద్ అలీ, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.