నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 13 : తుఫాన్ ప్రభావంతో భద్రాద్రి జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రే మొదలైన వాన.. తెల్లవారేసరికి పలు మండలాలను ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వాగులు పొంగిన కారణంగా, చెరువులు అలుగులు పడిన కారణంగా వారి పరీవాహక ప్రాంతాల్లోకి రోడ్లపైన వరద నీరు ప్రవహించింది. ఫలితంతా కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఈ వర్షం కారణంగా చేతికి అందివచ్చిన పంటలు దెబ్బతింటున్నాయంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని ఓ ఇంటిపై ఉన్న పిల్లర్‌పై ఆదివారం అర్ధరాత్రి పిడుగు పడింది. దీంతో ఆ పిల్లర్ చివర కొంత ధ్వంసమైంది. అయితే, తీవ్రత మరింతగా ఉంటే తమకు పెనుప్రమాదం తప్పిందని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇంటికి ఇరుగూపొరుగూ వారు కూడా భయాందోళన చెందారు. ఇక, ఎగువ నుంచి వరద పోటెత్తిన కారణంగా కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 24 వేల క్యూసెక్కులు, తాలిపేరు నుంచి 21 వేల క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేశారు.
మణుగూరులో ఆదివారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. కోడిపుంజుల వాగు, కట్టువాగులు పొంగి ప్రవహించాయి. వాగుమల్లారంలోని డబుల్బెడ్రూం కాలనీలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. రైల్వే గేటు సమీపంలో వరద ప్రవాహం ఎక్కువై రోడ్డుపైకి వరదనీరు చేరింది. కట్టుమల్లారంలో వాగు ఉధృతంగా రోడ్డు పైనుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిర్లాపురం వద్ద ప్రధాన రహదారిపై వరద ప్రవహించింది. శివలింగాపురంలో డ్రైనేజీ గోడ కూలింది. పగిడేరులో అలుగు పొంగడంతో శాంతినగర్‌లోకి వరదనీరు చేరింది.
రామానుజవరం – పగిడేరు దారిలో వరద ఉధృతికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సురక్షా బస్టాండ్‌లో ఉన్న కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలోకి వరదనీరు చేరింది. సిబ్బంది బకెట్లతో నీటిని బయటికి తోడారు. సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దుమ్ముగూడెం మండలంలో 52.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంగోలుచెరువు అలుగు పారుతోంది. ఆరువేల ఎకరాల్లో రేపోమాపో కోద్దామనుకుంటున్న పిన్న వరి ఈ వర్షానికి, గాలికి కింద పడింది. ఎనిమిది వేల ఎకరాల్లోని పత్తి పంట కూడా దెబ్బతిన్నది. చర్ల మండలంలో ఈతవాగు పొంగింది.
గొంపల్లి, కొత్తపల్లి, లింగాపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపహాడ్ మండలంలో సుమారు 70 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. దోమలవాగు పొంగి ప్రవహిస్తోంది. సోంపల్లి – బూర్గంపహాడ్ ప్రధాన రహదారిపైకి వాగు ప్రవహిస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 108.2 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. నారంవారిగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. అన్నపురెడ్డిపల్లిలో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వెంకమ్మచెరువులో అలుగు పారుతోంది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, రాజుపేట కాలనీ మధ్య ఉన్న నడుమ వాగు పొంగి వంతెనపై నుంచి పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కరకగూడెం మండలం పద్మాపురం – అనంతారం ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహించడంతో పంచాయతీ అధికారులు రహదారిపై ట్రాక్టర్ అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు. అనంతారం పంచాయతీ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లలేక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తి 24 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా పది గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 21,076 క్యూసెక్కుల నీటిని వదిలారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న గందం యాకయ్య అనే వ్యక్తి ఇంటిపై నిర్మాణంలో ఉన్న ఫిల్లర్పై పిడుగుపడింది. దీంతో ఆ ఇంటి యజమానులతోపాటు సమీపంలోని ఇళ్ల వాసులు కూడా భయందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున ఇంటిపైకి యాకయ్య వెళ్లి చూడగా పిల్లర్ ధ్వంసమై ఉంది. అయితే, ఆదివారం అర్ధరాత్రి యాకయ్య ఇంటిపై పిడుగు పడిన సమయంలో ఆ పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాకయ్య ఇంటిపై పడిన పిడుగు ప్రభావం తక్కువగా ఉండడంతో తమకు పెను ప్రమాదం తప్పిందని అతడి కుటుంబీకులు, ఇరుగూపొరుగు వారు చర్చించుకున్నారు.