తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 4 : ‘ఆకేరు వరద ప్రవాహం తమ తండాను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయేలా చేసింది. కట్టుబట్టలతో మిగిల్చింది. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఆదుకునేవారు కరువయ్యారు. మంత్రి పొంగులేటి వచ్చి ఆదేశాలిచ్చినా పట్టించుకునేవారు లేరు’ అంటూ మండలంలోని రాకాశితండా వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షంతో ఆకేరు ఉగ్రరూపం దాల్చడంతో రాకాశితండా పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. వరదలతో పంటలు, ఇంటి సామగ్రి, బియ్యం, ఇతర వస్తువులు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలామని, తమ తండాను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి అధికారులను ఆదేశించినా.. ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రంలో ఉంచి ఆహారం మాత్రం అందిస్తున్నారని తెలిపారు.
ఆకేరు వరదతో మా తండా మునిగిపోయి కట్టుబట్టలతో వచ్చాం. ఇళ్లలోని సామాన్లు, తిండి గింజలన్నీ కొట్టుకుపోయాయి. మమ్మల్ని జల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉంచి అన్నం పెడుతున్నారు. మంత్రి శ్రీనివాసరెడ్డి, అధికారులు వచ్చిపోయారు తప్ప మాకు ఎవరు ఇంతవరకు సాయం చేయలేదు.
-బానోత్ శారద, వరద బాధితురాలు, రాకాశితండా
నీళ్లలో నుంచి తండా బయటపడి మూడు రోజులైంది. ఇళ్లలో బురద అట్లనే ఉంది. ఇళ్లు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. తాగడానికి మంచినీళ్లు పంపిన నాధుడు లేడు. కనీసం వండుకొని తినడానికి వంట సామాన్లు లేవు. తండాలో కరెంటు రాలేదు. పత్తి పంట కొట్టుకుపోయింది. ఎలా బతకాలో అర్థం కావట్లేదు.
– శ్రీదేవి, వరద బాధితురాలు, రాకాశితండా
ఆకేరు వరదతో రెండున్నర ఎకరాల్లో మిరప, వరి పొలం నాశనమైంది. ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. మా తండాలో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. పంట భూముల్లో మేటలు వేసి పనికి రాకుండా రాళ్లు తేలాయి. తండా మంత్రి వచ్చి చెప్పినా ఎలాంటి సహాయం అందలేదు.
– బోడ కౌసల్య, వరద బాధితురాలు, రాకాశితండా