ప్రసిద్ధిగాంచిన పాలేరు జలాశయంలో రొయ్యలు, చేపల కోసం మత్స్యకారులు ప్రస్తుతం పరిగేరుకుంటున్నారు. ఇన్నాళ్లూ చేపలు, రొయ్యలతో కళకళలాడిన జలాశయం.. నేడు వెలవెలబోతోంది. నాడు విదేశాలకు ఎగుమతి చేసిన మొదటి రకం మంచినీటి రొయ్యలు నేడు కనుమరుగయ్యాయి. నాడు టన్నుల కొద్దీ ఎగుమతి చేసిన చేపల ఆనవాళ్లు కూడా నేడు కన్పించడం లేదు. పాలేరు మత్స్యసహకార సంఘానికి ఎన్నికలు లేకపోవడంతో పైరవీకారులదే రాజ్యమైంది. క్రమంగా సంఘం పట్టు కోల్పోయింది. అదీగాక.. 1,500 మంది సభ్యులున్న ఈ మత్స్య సహకార సంఘంలో ప్రస్తుతం సగం మంది మాత్రమే ముదిరాజులు, బెస్త(గంగపుత్రులు)లు ఉండడం గమనార్హం. అసలు, వేసవి వచ్చిందంటే చాలు.. రిజర్వాయర్ పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ జాతరలా కనిపించే చేపల ప్రియుల జాడలు ఇప్పుడు లేకుండా పోయాయి. మత్స్యకారుల్లో కూడా 20 శాతం మందికి కూడా ఉపాధి లభించడం లేదు. గతంలో రోజుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ సంపాదించిన మత్స్యకారులకు నేడు రూ.1000 రావడం కూడా గగనంగా మారడం గమనార్హం.
-కూసుమంచి, మే 12
మత్స్య సహకార సంఘానికి ఎన్నికలు లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం, రొయ్యల వ్యాపారులు ముందుకు రాకపోవడం వంటి కారణాలు పాలేరు మత్స్యకారుల బతుకులను అగమ్యగోచరం చేస్తున్నాయి. పాలేరు రొయ్యలకు విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుత పాలకులు, అధికారుల ఉదాసీనత కారణంగా అది తగ్గిపోతోంది. గతంలో పాలేరులో పట్టిన మంచినీటి రొయ్యలను విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాలకు పంపేవారు. అక్కడ ప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. కానీ.. నేడు ఆ జాడలే కన్పించడం లేదు. అసలు మత్స్యకారులు ప్రస్తుతం తమ రోజువారీ కుటుంబాన్ని గడుపుకునేందుకు సరిపడినన్ని చేపలు కూడా లభ్యం కావడం లేదు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల పరిసరాల్లోని సుమారు 10 గ్రామాల మత్స్యకారులు పాలేరు మత్స్య సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వేసవి వచ్చిందంటే వీరికి ఉపాధి పుష్కలంగా ఉండేది. చేపలవేట తేదీని ప్రకటించేందుకు నెల రోజులు ముందుగానే వలలు, తెప్పలు సిద్ధం చేసుకునేవారు. మార్కెటింగ్, అమ్మకాల సమాలోచనలతో బిజీబిజీగా ఉండేవారు. కానీ.. వారికి నేడు పాలేరులో పెద్దగా చేపలు లభ్యం కావడం లేదు. దీంతో ఇతర పనులకు వెళ్తున్నారు.
పాలేరులో ఏటా 13 లక్షల చేపపిల్లలు పోస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తారు. కానీ.. ఆ లెక్కలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి. దీంతో చేప పిల్లల గోల్మాల్పై సహకార సంఘ సభ్యులు తిరుగుబాటు చేసేవారు. చేపల విడుదల సమయంలో ప్రతిసారీ ఇవే ఘర్షణలు. ఈ నేపథ్యంలో గత కలెక్టర్ వీపీ గౌతమ్.. మత్స్య శాఖపై కొరడా ఝుళిపించారు. అధికారుల సమక్షంలో చేప పిల్లలను లెక్కబెట్టి మరీ పాలేరులో వదిలారు. ఇప్పుడు వేటకు దిగిన సభ్యులు రోజుకు రూ.1,000 నుంచి రూ.1,500 మాత్రమే ఆదాయం వస్తోంది. ఎక్కువ మంది సభ్యులు ఒకేసారి వేటకు దిగితే ఆదాయం తగ్గుతుంది. దీంతో విడతల వారీగా వేటకు దిగుతున్నాయి. అయినప్పటికీ గతంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు అందులో పదో వంతు కూడా రావడం లేదు.
మత్స్య సహకార సంఘంలో బెస్త(గంగపుత్రులు), ముదిరాజులు మాత్రమే సభ్యులుగా ఉండాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ సంఘంలో సగం మందికిపైగా సభ్యులు ఇతర కులాల వారే ఉండడం గమనార్హం. ఈ సంఘానికి పదేళ్ల క్రితం ఎన్నికలు జరగగా నాయకన్గూడేనికి చెందిన దేశబోయిన లింగయ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. రెండేళ్ల తరువాత అతడు అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో 8 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఉపాధ్యక్షుడైన ఎర్రగడ్డతండాకు చెందిన ఇస్లావత్ ఉపేందరే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో కొందరు సభ్యులు, అధికారులు కలిసి చేపపిల్లలు పోసే కాంట్రాక్టర్లతో చేతులు కలపడంతో పాలేరు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
దశాబ్దాలుగా చేపల వేటను నమ్ముకున్న మత్స్యకారులు ఏడాదిలో సుమారు నాలుగు నెలలపాటు చేపల వేట ద్వారా వచ్చే ఆదాయంలో జీవనం వెళ్లదీస్తారు. ఈ క్రమంలో పాలేరులో రొయ్యలు లేకపోవడం, చేపల వేట తగ్గడంతో మత్స్యకారుల ఉపాధిపై దెబ్బపడింది. సంఘం లేకపోవడంతో రొయ్యలు పోసేవారు ముందుకు రావడం లేదు. కేవలం చేపపిల్లలను మాత్రమే పోస్తున్నారు. గతంలో రోజుకు 1,300 మంది వరకూ జలాశయంలో వేటకు వెళ్లేవారు. ప్రస్తుతం 300 మంది కూడా వెళ్లడం లేదు. దీంతో సంఘంలోని 1,500 మంది సభ్యుల జీవనోపాధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
సీజన్లో చేపల వేటతో గతంలో రోజుకు రూ.5 వేలకు పైగానే ఆదాయం పొందేవాళ్లం. కానీ.. ఇప్పుడు రూ.1,000 రావడం కూడా కష్టంగా ఉంది. సంఘం సక్రమంగా లేకపోవడంతో సభ్యులు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రొయ్య పిల్లలు పోసేవారు ముందుకు రావడం లేదు. కేవలం ప్రభుత్వం పోస్తున్న చేపపిల్లలే దిక్కవుతున్నాయి. 1,500 మంది సభ్యుల్లో ప్రస్తుతం 300లోపు మందే వేటకు వెళ్తున్నారు.
-బత్తుల ఉప్పయ్య, మత్స్యకారుడు