రఘునాథపాలెం/ కూసుమంచి/ ఆళ్లపల్లి/ దుమ్ముగూడెం/ భద్రాచలం/ ఇల్లెందు, ఏప్రిల్ 27 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగ్రో డీలర్లు సోమవారం సమ్మెబాట పట్టారు. ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒకరోజు సంపూర్ణ బంద్ పాటించారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్ వ్యాపారులంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫర్టిలైజర్ దుకాణాల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు బంద్ పాటించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులకు రాయితీపై అందించే ఎరువులతోపాటు రాయితీ లేని లేదా లింక్ ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయా కంపెనీలు డీలర్లను బలవంతం చేస్తున్నాయని.. దీంతో క్షేత్రస్థాయిలో డీలర్లు రైతుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లింక్ ఉత్పత్తులు అంటగట్టడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతేకాక కంపెనీలు ఎరువులను నేరుగా డీలర్ వద్దకే అందించాలన్నారు. ప్రస్తుతం రైల్వేషెడ్ల నుంచి మాత్రమే అందిస్తున్నారని, ఫలితంగా ఒక్కో బస్తాకు రవాణా చార్జీలు రూ.40 నుంచి రూ.50 వరకు భారం పడుతోందన్నారు. మార్జిన్‌ను కనీసం 8శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. విత్తనాలు మొలకెత్తకపోతే కంపెనీలను వదిలి నేరుగా డీలర్‌ను బాధ్యున్ని చేయడాన్ని తప్పుపట్టారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
రఘునాథపాలెంలో సంఘం మండల అధ్యక్షుడు మన్నెం అప్పారావు, వెంకట కోటయ్య, శ్రీను, కుమార్ పాల్గొన్నారు. కూసుమంచిలో ఎండీ రంజాన్ అలీ, పిట్టల కన్నయ్య, బిక్కసారి హరీశ్, కూరపాటి సందీప్, ఇంటూరి నారాయణ, మల్కూరి శ్యాంసుందర్‌రెడ్డి, తిరుపతిరావు, చెన్నారెడ్డి, ఆళ్లపల్లిలో డీలర్లు గౌరిశెట్టి శ్రీనివాస్, అబ్బునాగేశ్వరరావు, అనుమోల వెంకటేశ్వరరరావు, తాళ్లపల్లి నాగేశ్వరరావు, సంకా ప్రభాకర్, నరెడ్ల వెంకన్న, బురుగడ్డ రాములు, దుమ్ముగూడెంలో ఎరువుల దుకాణాల సంఘం బాధ్యులు పాలడుగు శివరామకృష్ణ, వాకచర్ల బుజ్జి, భద్రాచలంలో అసోసియేషన్ సభ్యులు సత్తిరాజు, సాగర్, ఇల్లెందులో నాళ్ల సోమసుందర్, పొద్దుటూరి నాగేశ్వరరావు, నారాయణదాసు లాహోటి, ఆంజనేయులు, ఉపేందర్, పవన్ లోయ, మెట్ల కృష్ణ, రాజేష్, యుగేంధర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.