బోనకల్లు, జులై 30 : ఎరువుల డీలర్లు రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్య అన్నారు. బుధవారం మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు విజయచంద్రతో కలిసి బోనకల్లు మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఫార్మర్ సేల్ రిజిస్టర్, బిల్ బుక్, ఇన్వాయిస్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలన్నారు. మండల పరిధిలో ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల్లో సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులెవరూ యూరియా కోసం ఆందోళన పడవద్దన్నారు.
అనంతరం మండలంలోని పత్తి పంటలను పరిశీలించారు. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిలీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. వర్షపు నీరు నిలబడిన చోట సూక్ష్మధాతు లోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి 10 గ్రాములు యూరియా లేదా 19:19:19 లేదా 13:0:45 లీటర్ నీటిలో కలుపుకుని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలని సూచించారు. పెసర పంటను పరిశీలించి పొగాకు లద్దె పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2 మిలీ/లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. అదేవిధంగా రైతులందరూ నానో (ద్రవ) యూరియా వాడటం ద్వారా పంట ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ పసునూరి వినయ్ కుమార్, ఏఈఓ షేక్ హుస్సేన్ సాహెబ్, సహకార సంఘం సెక్రటరీలు పాల్గొన్నారు.
Bonakal : ఎరువుల డీలర్లు రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలి : డీఏఓ పుల్లయ్య