కారేపల్లి, అక్టోబర్ 22 : రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైరా ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం సింగరేణి మండలం అప్పాయ్యగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మీప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్లో సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (సిసిఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించి మాట్లాడారు. పత్తి రైతులు నష్ట పోకుండా కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు జరుగుతుందని తెలిపారు.
రైతులెవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, నేరుగా సిసిఐ కేంద్రాలకు పత్తి తీసుకు రావాలని సూచించారు. సిసిఐ కేంద్రాల ద్వారా పారదర్శకంగా కొనుగోలు జరగడం రైతులకు నమ్మకం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ఏడీఏ కరుణశ్రీ, ఏఈఓలు, సిసిఐ ప్రతినిధులు, ఇల్లెందు మార్కెట్ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ కార్యదర్శి నరేశ్, సూపర్వైజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.